English | Telugu

వివాదంలో ‘హరిహర వీరమల్లు’.. అతనే కారణమా?

వివాదంలో ‘హరిహర వీరమల్లు’.. అతనే కారణమా?

పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ తొలి పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కిన ‘హరిహర వీరమల్లు’ చిత్రం జూలై 24న విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్‌ అనేక కారణాల వల్ల పలుమార్లు వాయిదా పడింది. ఈ సినిమా రిలీజ్‌ విషయంలో పవర్‌స్టార్‌ ఫ్యాన్స్‌ ఎప్పటికప్పుడు నిరాశకు గురవుతూనే ఉన్నారు. తాజాగా ప్రకటించిన డేట్‌కి సినిమా తప్పకుండా రిలీజ్‌ అవుతుందన్న కాన్ఫిడెన్స్‌ అందరిలోనూ ఉన్న సమయంలో ఓ కొత్త సమస్య చిత్ర యూనిట్‌కి తలనొప్పిగా మారింది. ఈ సినిమాను బీసీ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇటీవల రిలీజ్‌ అయిన ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్‌తో వారిలో నిరసనలు మరింత పెరిగాయని చెప్పాలి. సినిమా రిలీజ్‌ను అడ్డుకుంటామని ఆ సంఘం ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు. అసలు ఈ సినిమాకీ, బీసీలకు ఉన్న సంబంధం ఏమిటి? రిలీజ్‌ను అడ్డుకునేంత వివాదం సినిమాలో ఏం ఉంది అనే వివరాల్లోకి వెళితే.. 

‘హరిహర వీరమల్లు’ చిత్రాన్ని ప్రారంభించిన నాటి నుంచి ఒక విషయం ప్రచారంలో ఉంది. అదేమిటంటే.. తెలంగాణ పోరాట యోధుడు పండుగ సాయన్న జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారని సోషల్‌ మీడియాలో బాగా ప్రచారం జరిగింది. దాన్ని ఆధారం చేసుకొని బీసీ సంఘాల వారు కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. వాస్తవ కథను వక్రీకరించి, సినిమాకి ఉపయోగపడే అనేక అంశాలను జోడించి ఒక కల్పిత కథగా పండుగ సాయన్న జీవిత చరిత్రను తెరకెక్కించారని చెబుతున్నారు. ఈ ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని హరిహర వీరమల్లు ఒక కల్పిత పాత్ర అనీ, ఎవరి జీవిత చరిత్ర కాదని ఇప్పటికే చిత్ర యూనిట్‌ వెల్లడించింది. అయితే దీనితో బీసీ సంఘాల నాయకులు ఏకీభవించడం లేదు. పండుగ సాయన్నను పోలిన కల్పిత పాత్రను సృష్టించి సినిమాగా రూపొందించడం అనేది బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని ఆయా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. డబ్బు సంపాదించేందుకు ఒక యోధుడి జీవిత చరిత్రను తప్పుదోవ పట్టించేలా సినిమా తీస్తే ఊరుకునేది లేదని, ఎట్టి పరిస్థితుల్లో సినిమా రిలీజ్‌ను అడ్డుకుంటామని అంటున్నారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీకి చెందిన శివ ముదిరాజ్‌ సహా పలువురు నాయకులు.. బీసీ సంఘాలు చేస్తున్న ఆందోళనకు సోషల్‌ మీడియా ద్వారా తమ మద్దతును తెలియజేస్తున్నారు. 

ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చిన ‘హరిహర వీరమల్లు’ ఎట్టకేలకు జూలై 24న విడుదల కాబోతోంది. ఆ ఆనందంలో ఉన్న పవర్‌స్టార్‌ ఫ్యాన్స్‌ తాజా పరిస్థితిపై ఆందోళన చెందుతున్నారు. అంతా సజావుగా సాగుతోంది అనుకుంటున్న తరుణంలో బీసీల ఆందోళన చిత్ర యూనిట్‌కు పెద్ద సమస్యగా మారింది. మరి కొద్దిరోజుల్లోనే ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. అయితే తాజా పరిణామాలు సినిమా రిలీజ్‌పై ప్రభావాన్ని చూపిస్తాయా, హరిహర వీరమల్లు ఈసారైనా చెప్పిన డేట్‌కి రిలీజ్‌ అవుతుందా లేదా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.