English | Telugu
'భగవంత్ కేసరి' మూవీ యూఎస్ రివ్యూ.. బాలయ్య ఏడిపించేశాడు!
Updated : Oct 18, 2023
నటసింహం నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ పోషించిన లేటెస్ట్ మూవీ 'భగవంత్ కేసరి'. అనిల్ రావిపూడి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ నిర్మించిన ఈ యాక్షన్ డ్రామాలో శ్రీలీల, కాజల్ అగర్వాల్, అర్జున్ రామ్ పాల్ ముఖ్య పాత్రలు పోషించారు. దసరా కానుకగా ఈ చిత్రం నేడు(అక్టోబర్ 19న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలయ్య, రావిపూడి కలయికలో వచ్చిన మొదటి సినిమా కావడంతో ముందు నుంచి 'భగవంత్ కేసరి'పై మంచి అంచనాలు ఉన్నాయి. పైగా 'అఖండ', 'వీరసింహారెడ్డి' వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత బాలయ్య నటించిన చిత్రమిది. దీంతో ఈ సినిమాతో బాలకృష్ణ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ బలంగా నమ్మారు. ఆ నమ్మకాన్ని నిజం చేసేలా 'భగవంత్ కేసరి' ఉంది.
ఇది బాలయ్య స్టైల్ లో గానీ, రావిపూడి మార్క్ లో గానీ నడిచే రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్ కాదు. ట్రైలర్ లో చూపించినట్టుగా, మూవీ టీమ్ చెప్పినట్టుగా.. మాస్ ని మెప్పించే యాక్షన్ సన్నివేశాలతో పాటు, సాధారణ ప్రేక్షకులను కట్టిపడేసే బలమైన ఎమోషన్స్ తో నిండిన చిత్రమిది.
జైల్ ఫైట్ తో బాలయ్య ఇంట్రడక్షన్ అదిరిపోయింది. ఆ తర్వాత బాలయ్య, శ్రీలీల మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. గణేష్ సాంగ్ ఫ్యాన్స్ కి పండగే అని చెప్పొచ్చు. ఇంటర్వెల్ ఎపిసోడ్ అయితే ఓ రేంజ్ లో ఉంది. ఫ్యాన్స్ ని, మాస్ ని మెప్పిస్తుంది. మాస్ యాక్షన్ బ్లాక్స్, సెంటిమెంట్ సీన్స్, పవర్ ఫుల్ డైలాగ్స్ తో అనిల్ రావిపూడి ఫస్టాఫ్ ని బాగా నడిపించాడు.
ఇక సెకండాఫ్ అయితే ఫస్టాఫ్ ని మించి ఉంది. సెకండాఫ్ లో మాస్, ఫన్ ఉండేలా చూసుకున్నాడు రావిపూడి. ముఖ్యంగా సెకండాఫ్ లో మొదటి 20 నిమిషాలు ఫ్యాన్స్ ని మెప్పించేలా ఉంటుంది. ఇక చిన్నారులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి కేసరి చెప్పే ఎపిసోడ్ కంటతడి పెట్టించేలా ఉంది. పతాక సన్నివేశాలు కూడా ఆకట్టుకున్నాయి. ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ రేసీగా ఉంది. డైలాగ్స్, థమన్ బీజీఎం కూడా బాగున్నాయి. మొత్తానికి భగవంత్ కేసరి.. మాస్ మెచ్చే యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు, కుటుంబ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకునే బలమైన ఎమోషన్స్ ఉన్న చిత్రం. కామెడీ కోరుకునే వారు మాత్రం కాస్త నిరాశ చెందుతారు.
నేలకొండ భగవంత్ కేసరిగా బాలకృష్ణ నట విశ్వరూపం చూపించాడు. పాత్ర నుంచి ఏమాత్రం బయటకు వెళ్ళకుండా.. పాత్రకి తగ్గట్టుగా జీవించేశాడు. శ్రీలీలకు మొదటిసారి తన యాక్టింగ్ టాలెంట్ చూపించుకునే పాత్ర దక్కింది. ఆ అవకాశాన్ని ఆమె చక్కగా ఉపయోగించుకుంది. నటనతో కట్టి పడేసింది.