English | Telugu
'లియో' మూవీ ఫస్ట్ రివ్యూ.. లోకేష్ మార్క్ మిస్ అయింది!
Updated : Oct 18, 2023
దళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'లియో'. ఈ యాక్షన్ థ్రిల్లర్ నేడు(అక్టోబర్ 19న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'విక్రమ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత లోకేష్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా కావడంతో 'లియో'పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఇది 'మాస్టర్' వంటి సూపర్ హిట్ తర్వాత లోకేష్, విజయ్ కాంబినేషన్ లో రూపొందిన సినిమా. భారీ అంచనాలతో విడుదలైన లియో.. ఓవర్సీస్ ప్రీమియర్ షోలతో పరవాలేదు అనే టాక్ తో సరిపెట్టుకుంది.
'ఖైదీ', 'విక్రమ్' తర్వాత లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా రూపొందిన మూడో సినిమా లియో. హిమాచల్ ప్రదేశ్ లో కాంట్రాక్ట్ కిల్లింగ్ ఎపిసోడ్ తో సినిమా ప్రారంభమైంది. హైనాతో ఫైట్ ఎపిసోడ్ తో విజయ్ ఇంట్రడక్షన్ ఆకట్టుకుంది. సీరియల్ కిల్లర్ గ్యాంగ్ తో తలపడే సన్నివేశం, ఇంటర్వెల్ బ్లాక్ మెప్పించాయి. అక్కడక్కడా కాస్త నెమ్మదిగా సాగినట్లు అనిపించినా.. ఇంటర్వెల్ కి ముందు 40 నిమిషాలు బాగానే ఆకట్టుకుంది.
సంజయ్ దత్, త్రిష.. విజయ్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించే సన్నివేశాలతో సెకండాఫ్ మొదలైంది. అయితే ఫస్టాప్ తో పోలిస్తే సెకండాఫ్ చాలా డల్ అయింది. లోకేష్ మార్క్ కనిపించలేదు. సంజయ్ దత్, అర్జున్ పాత్రలు తేలిపోయాయి. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఆశించిన స్థాయిలో లేదు. పతాక సన్నివేశాలు కూడా భారీగా ఉన్నప్పటికీ, సాగదీసినట్లుగా అనిపించాయి. అలాగే యాక్షన్ డోస్ కూడా ఎక్కువైంది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ని లింక్ చేస్తూ వచ్చిన సన్నివేశాలు మాత్రం బాగానే ఉన్నాయి.
కథలో కొత్తదనం లేనప్పటికీ తన మార్క్ స్క్రీన్ ప్లే తో లోకేష్ సినిమాని ఆసక్తికరంగా మలిచే ప్రయత్నం చేశాడు. కానీ అందులో కొంతవరకే సక్సెస్ అయ్యాడు. సెకండాఫ్ లో చేతులెత్తేశాడు. కొన్ని చోట్ల లాజిక్స్ మిస్ అయినట్లుగా, కథనం నెమ్మదిగా సాగినట్లుగా అనిపిస్తుంది. టెక్నికల్ వాల్యూస్ మాత్రం బాగున్నాయి. అనిరుధ్ మరోసారి తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు. సీరియస్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం.. లోకేష్ గత చిత్రాల మాదిరిగా బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ క్రియేట్ చేయడం అనుమానమే.