English | Telugu
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో నాలుగో సినిమా ప్రకటన!
Updated : Jul 2, 2023
టాలీవుడ్ లో ఉన్న క్రేజీ కాంబినేషన్స్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబో ఒకటి. ఇప్పటిదాకా వీరి కలయికలో 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి', 'అల వైకుంఠపురములో' సినిమాలు రాగా మూడూ విజయాన్ని సాధించాయి. ముఖ్యంగా 'అల వైకుంఠపురములో' సంచలన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ హిట్ కాంబో నాలుగోసారి చేతులు కలిపింది.
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కలయికలో రూపొందనున్న నాలుగో సినిమా ప్రకటన రేపు ఉదయం 10:08 గంటలకు రానుంది. ఈ చిత్రాన్ని హారిక & హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. 'పుష్ప' తో బన్నీ పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో రూపొందించనున్నారని సమాచారం.
త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా 'గుంటూరు కారం' చేస్తుండగా.. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ 'పుష్ప-2' చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ లు పూర్తయ్యాక బన్నీ-త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కనున్న నాలుగో సినిమా పట్టాలెక్కనుంది.
