English | Telugu
పవన్ కళ్యాణ్ ని బెదిరిస్తున్నారా?.. రెచ్చిపోయిన అల్లు అరవింద్..!
Updated : May 25, 2025
ఓ వైపు పవన్ కళ్యాణ్ 'హరి హర వీరమల్లు' సినిమా జూన్ 12న విడుదలవుతుండగా.. మరోవైపు సింగిల్ స్క్రీన్స్ లో షేర్ విధానం అమలు చేయకపోతే జూన్ 1 నుంచి థియేటర్లు మూసి వేయడానికి ప్రయత్నాలు జరిగాయి. ఈ థియేటర్ల మూసివేత వెనుక ఆ నలుగురు ఉన్నారని ప్రచారం జరిగింది. ఆ నలుగురిలో అల్లు అరవింద్ పేరు కూడా వినిపించింది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించిన అరవింద్.. ఆ నలుగురిలో తాను లేనని చెప్పారు.
"ఆ నలుగురు వ్యాపారంలో నేను లేను. కోవిడ్ టైంలోనే బయటకు వచ్చేశాను. తెలంగాణలో ప్రస్తుతం నా దగ్గర ఒక్క థియేటర్ కూడా లీజ్ లో లేదు. నా దగ్గర ఉన్నది ఒక్కటే థియేటర్.. AAA. దానికి ఓనర్ ని. ఆంధ్రాలో కూడా అన్నీ వదిలేసుకుంటూ వస్తున్నాను. తెలుగు రాష్ట్రాల్లో 1500 థియేటర్లు ఉంటే.. నా దగ్గర 15 లోపు ఉన్నాయి. అవి కూడా లీజ్ అయిపోయిన తర్వాత.. రెన్యువల్ చేయించవద్దని మా స్టాఫ్ తో చెప్పాను. పాత అలవాటు కొద్దీ 'ఆ నలుగురు ఆ నలుగురు' అంటూ నా ఫొటో వేస్తున్నారు తప్ప.. నేను ఆ నలుగురిలో లేను." అని అల్లు అరవింద్ అన్నారు.
అలాగే పవన్ కళ్యాణ్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్న దానిపై కూడా అల్లు అరవింద్ స్పందించారు. "పవన్ కళ్యాణ్ గారు బాధ పడింది వంద శాతం నిజం. ఆయన సినిమా వస్తుంటే.. థియేటర్లు మూసేస్తాం అంటూ.. ఆయనను బెదిరిస్తున్నారా ఏంటి?" అని అరవింద్ ప్రశ్నించారు. "పవన్ కళ్యాణ్ సినిమా విడుదలవుతుండగా థియేటర్లు మూసేస్తాం అనడం దుస్సాహసం. పెద్దలు కానీ, చిన్నలు కానీ ఈ దుస్సాహసానికి ముందడుగు వేయకూడదు. మన ఇండస్ట్రీ నుంచి వెళ్లి, మన ఇండస్ట్రీకి హెల్ప్ చేస్తున్న వ్యక్తి పవన్." అని అరవింద్ అన్నారు.