English | Telugu
రాజమౌళిపై కత్తికట్టాడు
Updated : Jun 15, 2015
రాజమౌళి - ప్రభాస్‌ల బాహుబలి కోసం చిత్రసీమ యావత్తు ఎదురుచూస్తోంది. టాలీవుడ్ ఒక్కటే కాదు భారతదేశం మొత్తం బాహుబలి ఎలా ఉండబోతోందన్న విషయంపై ఆసక్తిగా చర్చించుకొంటోంది. ఈ సినిమాలో పనిచేసినా, పనిచేయకనపోయినా `బాహుబలి లాంటి సినిమా తెలుగులో తెరకెక్కడం మనందరి అదృష్టం` అని అందరూ ముక్తకంఠంతో చెబుతున్నారు. అయితే ఒక్క నటుడు మాత్రం ఈ సినిమాపై కత్తికట్టాడు.
`బాహుబలిని, రాజమౌళిని నేను సపోర్ట్ చేయలేను` అంటూ తన అసహనాన్ని అయిష్టాన్నీ బాహాటంగానే వెళ్లగక్కుతున్నాడు. ఆ నటుడెవరో కాదు. సీనియర్ ఆర్టిస్ట్ సురేష్. తెలుగులో ఇంతమంది ప్రతిభావంతులు ఉండగా నాజర్‌లాంటి వాళ్లకు బాహుబలిలో అవకాశం ఇవ్వడం ఏమిటి? సాయికుమార్, సుమన్‌లాంటి నటుల్ని వదిలేసి పరభాషా నటులు అవకాశాలు ఇస్తారా? అంటూ సురేష్ నిలదీస్తున్నాడు.
తెలుగులో పరభాషా నటుల ఆధిపత్యంపై సురేష్ ముందు నుంచీ విమర్శనగళం వినిపిస్తూనే ఉన్నాడు. ఈసారి బాహుబలిలాంటి పెద్దసినిమాని టార్గెట్ చేయడం కాస్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. సురేష్ ని గత కొంతకాలంగా టాలీవుడ్ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఆ ఆక్రోశం ఇలా చూపించేస్తున్నాడేమో.