English | Telugu

ఆ పార్టీలోనే చేరి అందరి పని చెబుతా.. నా జోలికి రావద్దు: శివాజీ!

నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకొని అందరి మన్ననలు పొందిన శివాజీ.. రాజకీయాల్లో కూడా ప్రవేశించి, ప్రజల తరఫున పలు ఉద్యమాల్లో పాల్గొన్నారు. ప్రజల సమస్యను తన సమస్యగా భావించి పోరాటం చేశారు. అయితే కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల శివాజీ ప్రధాన పాత్రలో రూపొందిన ‘నైన్టీస్‌: ఎ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌’ వెబ్‌ సిరీస్‌ నటించారు. ఈ వెబ్‌ సిరీస్‌ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ వెబ్‌సిరీస్‌ సక్సెస్‌మీట్‌ జరిగింది. ఈ సందర్భంగా తన పొలిటికల్‌ ఎంట్రీపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనలాంటి వారు రాజకీయాలకు పనికిరారని, రాజకీయాలకు తాను సెట్‌ అవ్వనని శివాజీ అంటున్నారు. యాక్టింగ్‌లోనే ఉంటూ ప్రజలకు ఏదైనా సమస్య వచ్చినపుడు వారి తరఫున తన వాణి వినిపిస్తానని స్పష్టం చేస్తున్నారు. తాను రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేశానని, ఆ విషయంలో తాను సంతృప్తిగా ఉన్నానని అన్నారు. తాను నిజాలు మాట్లాడతాను కాబట్టే అందరికీ సమస్యగా ఉందని అన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో తానెప్పుడు భాగం కాలేదని, వాటితో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగా ఏదైనా రాజకీయ పార్టీకి తనను ఆపాదిస్తే ఖచ్చితంగా ఆ పార్టీలోనే చేరి అందరి పని చెబుతానని, తన జోలికి రావద్దని హెచ్చరించారు.

ఇక తను చేసిన వెబ్‌సిరీస్‌ గురించి మాట్లాడుతూ ‘ఈ ప్రాజెక్ట్‌ చేయడానికి ప్రధాన కారణం సిరీస్‌లోని చిన్న కొడుకు ఆదిత్య పాత్ర. ఆదిత్య నా చిన్న కొడుకు. అతను కూడా అలాగే సరదాగా ఉంటాడు. దీనికి సీక్వెల్‌ కూడా ఉంటుంది. అందులో ఇంటర్‌, ఇంజినీరింగ్‌ గురించి ఉంటుంది. నా జీవితాన్ని స్ఫూర్తిగా చేసుకుని ఆదిత్య రోల్‌ క్రియేట్‌ చేశాను. అందుకే తన పేరే పెట్టాను. బిగ్‌బాస్‌ నుంచి బయటకు వచ్చాక ఎనిమిది స్క్రిప్ట్‌లు విన్నాను. కామెడీ బేస్డ్‌ సబ్జెక్ట్‌ ఒకటి ఓకే చేశాను. త్వరలోనే విలన్‌గా కూడా నటించబోతున్నాను’’ అని వివరించారు.