Read more!

English | Telugu

గరం : రివ్యూ

తెలుగు వన్ రివ్యూ : గరం

మాస్ కమర్షియల్ అనగానే, నాలుగు డిష్యుం డిష్యుంలు, రజనీకాంత్ లెవల్లో పంచ్ డైలాగ్ లు, హిట్ సినిమాలకు స్ఫూఫ్ లు అని అనుకుంటే అంతకంటే అమాయకత్వం ఉండదు. కొంచెం కథ కూడా ఉంటేనే సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారు. మరి పక్కా మాస్ ఎంటర్ టైనర్ అంటూ వచ్చిన గరం ఎలా ఉంది..? సినిమాలో కథ కనబడుతుందా..లేక వెతుక్కోవాలా..? చూద్దాం..

 



కథ
రాంబాబుకు(తనికెళ్ల భరణి) లేక లేక కలిగిన ఏకైక సంతానం వరాలబాబు(ఆది). అందరు మాస్ హీరోల్లాగే మనోడు కూడా చదువు సంధ్యలు సరిగ్గా వంటబట్టించుకోకుండా పెద్దోడవుతాడు. వరాలుకీ, పక్కింటి రవి(చైతన్య కృష్ణ)కి అసలు పడదు. వన్ ఫైన్ డే, రాంబాబు వరాలబాబుకు క్లాస్ పీకుతూ, పక్కింటి రవితో కంపేర్ చేస్తాడు. దీంతో పౌరుషం వచ్చేసిన వరాలబాబు, ఏదొకటి సాధిస్తా అని మంగయ్య శపథం చేసి హైదరాబాద్ బస్ ఎక్కుతాడు. హైదరాబాద్ లో దిగీ దిగగానే హీరోయిన్ సమీర(అదా శర్మ)ను చూసి  బాబు ఫ్లాట్. ఇక అక్కడి నుంచి ఆమెను ఇంప్రెస్ చేసే ప్రయత్నాలు మొదలవుతాయి. ఈ ప్రాసెస్ లోనే ఒక ట్విస్ట్ తో ఇంటర్వెల్ వస్తుంది. హైదరాబాద్ లో రవిని అనుకోని పరిస్థితుల్లో చూసి వరాల బాబు షాక్ అవుతాడు. అప్పటి వరకూ తను వెంటపడిన సమీరకు మరో పేరుందని ఆమెకు రవి కూడా తెలుసని వరాలబాబుకు మరో షాక్..అసలు రవికి సమీరకు సంబంధమేంటి..? రవికి ఏమైంది..? మధ్యలో ఈ బిజ్జు(కబీర్ ) పాత్ర ఎవరు..? బాబు తన ప్రేమను గెలిచాడా..? చివరికి ప్రయోజకుడయ్యాడా..? అదీ బ్యాలెన్స్ కథ.

అనాలసిస్
మాస్ హీరోగా సినిమాకు ఎమేం చెయ్యాలో అవన్నీ చేశాడు ఆది. తన వరకు సినిమాకు హండ్రెడ్ పర్సంట్ ఎఫర్ట్ పెట్టాడు. డైలాగులు బాగున్నా, అవి ఆదికి పెద్దగా సెట్ అయినట్టు అనిపించదు. హీరోయిన్ గా ఆదా శర్మ తేలిపోయింది. లుక్స్ పరంగా, పెర్ఫామెన్స్ పరంగా ఏ మాత్రం ఆకట్టుకోదు. విలన్ గా కబీర్ దుహన్ సింగ్, తండ్రుల పాత్రల్లో తనికెళ్ల భరణి, నరేష్ మెప్పిస్తారు. క్లైమాక్స్ లో నరేష్ నటన ఆకట్టుకుంటుంది. ఇక కామెడీ విషయానికొస్తే, సినిమాకు ఇది పెద్ద మైనస్. పోసాని, పృథ్వి, తాగుబోతు రమేష్ లు ఏమాత్రం మెప్పించలేకపోయారు. షకలక శంకర్ కొద్దిగా పర్లేదు. బ్రహ్మానందం బోర్ కొట్టిస్తాడు.

టెక్నికల్ గా చూస్తే, స్లో అండ్ క్లాసికల్ మూవీస్ తీసే మదన్ తనది కాని మాస్ ట్రాక్ లోకి వచ్చి తీసిన సినిమా ఇది. ఆయన గత సినిమాలు పెళ్లైన కొత్తలో, గుండె ఝల్లుమంది, ప్రవరాఖ్యుడు చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. పూర్తి రొటీన్ మాస్ స్టోరీకి కొద్దిగా కామెడీని కలిపి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఎక్కడో ఒక చోట కొద్దిగా నవ్వుకోవచ్చు తప్ప, కామెడీ అని ఎక్కడా అనిపించదు. సినిమా అంతా ఏం జరగబోతోందో ముందే తెలిసిపోతుంటుంది. కమర్షియల్ ఫీల్ రప్పించడం కోసం బలవంతంగా ఇరికించిన సీన్స్ సినిమాకు స్పీడ్ బ్రేకర్స్..అగస్త్య ఇచ్చిన సాంగ్స్ ఓకే..డైలాగ్స్ బాగానే ఉన్నా, ఆదికి అంతగా సూట్ అవలేదనే ఫీల్ కలుగుతుంది.

తెలుగువన్ వ్యూ :

నిర్మాణపరంగా, సాయికుమార్ కు ఫుల్ మార్క్స్ వేయచ్చు. తన కొడుకు కోసం భారీ ఖర్చుకు వెనకాడకుండా ఆయన ప్రయత్నం చేయడాన్ని మెచ్చుకోవచ్చు. కానీ ఒక భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆదికి మాత్రం ఎదురుచూపులు తప్పేలా లేవు.

తెలుగువన్ రేటింగ్ : 2.5