English | Telugu
'గేమ్ చేంజర్'పై కొత్త అనుమానాలు.. తమిళ సినిమానా?
Updated : Mar 28, 2023
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం 'గేమ్ చేంజర్'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి శంకర్ దర్శకుడు. రామ్ చరణ్ పుట్టినరోజు(మార్చి 27) సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. చరణ్ అల్ట్రా స్టైలిష్ లుక్ కి అందరూ ఫిదా అయిపోయారు. ఇదిలా ఉంటే ఈ ఫస్ట్ లుక్ కొత్త అనుమానాలకు తెరదీసింది. అసలు ఇది తెలుగు సినిమానా? లేక తమిళ సినిమానా? అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
పాన్ ఇండియాలకు ఎక్కువగా ఇంగ్లీష్ టైటిల్స్ తో పోస్టర్లను వదులుతారు.. లేదా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ ఇలా ఐదు భాషల్లో విడివిడిగా పోస్టర్లను విడుదల చేస్తుంటారు. కానీ 'గేమ్ చేంజర్' విషయంలో మాత్రం ఇంగ్లీష్ పోస్టర్ తో పాటు ఒక్క తమిళ పోస్టర్ ను మాత్రమే వదిలారు. కేవలం ఇంగ్లీష్ పోస్టర్ ని విడుదల చేసుంటే.. పాన్ ఇండియా సినిమా కాబట్టి అలా విడుదల చేశారని అందరూ భావించేవారు. కానీ ఇంగ్లీష్ తో పాటు తమిళ పోస్టర్ ను విడుదల చేసి, తెలుగు పోస్టర్ ను మాత్రం విడుదల చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
'గేమ్ చేంజర్' దర్శకుడు శంకర్ కోలీవుడ్ కి చెందినప్పటికీ.. హీరోగా టాలీవుడ్ స్టార్ చరణ్ నటిస్తున్నాడు. పైగా టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నాడు. దాంతో ఈ చిత్రాన్ని తెలుగులో తెరకెక్కించి మిగతా భాషల్లోకి డబ్ చేస్తారనే అభిప్రాయంలో అందరూ ఉన్నారు. కానీ ఫస్ట్ లుక్ విడుదలయ్యాక అసలు ఇది తమిళ సినిమానా అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లీష్ తో పాటు తెలుగు పోస్టర్ విడుదల చేయకుండా, తమిళ పోస్టర్ విడుదల చేయడం వెనక ఉద్దేశం ఏమిటో అర్థంకావడంలేదు అంటున్నారు. మరి ఈ విషయంపై మేకర్స్ ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
