English | Telugu

ఉలవచారుకి పోపు పెట్టింది ఆయన

పేరు పెట్టింది ఒకరు, ప్రాణం పోసింది ఇంకొకరు.... ఉలవచారు బిర్యాని చిత్రం గురించి ప్రకాష్ రాజ్ చెప్పిన మాటలివి. నటుడిగా దక్షిణాదితో పాటు హిందీ చిత్రసీమలోను తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ప్రకాష్ రాజ్. ఆయన దర్శకుడిగా కూడా తన ప్రతిభ చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన గతంలో దర్శకత్వం వహించిన చిత్రం ‘ధోని’. తాజాగా ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఉలవచారు బిర్యాని’. ఈ సినిమా జూన్ 6 న విడుదల కానున్న నేపథ్యంలో ఈ చిత్రం గురించి ఆసక్తికర విశేషాలను ఆయన మీడియాతో పంచుకున్నారు. సంవత్సరం కష్టపడి తాను సినిమాను చిత్రీకరిస్తే కేవలం ఒక్క నెలలో రీరికార్డింగ్ చేసి, సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు ఇళయరాజా తీసుకువెళ్లారన్నారు. మ్యూజిక్‌తో సినిమాకు ప్రాణం పోసే, ఇళయరాజా ప్రతిభ చూస్తే జెలసీ కలుగుతుందని, ఆయనపై కేసు వేయాలనిపిస్తుందని సరదాగా జోక్ చేశారు. ఇక ఉలవచారు బిర్యాని అనే డిఫరెంట్ టైటిల్‌ని ఈ చిత్రానికి తన బెస్ట్ ఫ్రెండ్ పూరీ జగన్నాథ్ పెట్టారని కూడా తెలిపారు. ప్రేమను పంచడానికి, వ్యక్త పరచడానికి వంటను మించింది మరొకటి లేదు అనే విషయాన్ని ఈ చిత్రం ద్వారా చూపించే ప్రయత్నం చేశారు దర్శకులు ప్రకాష్ రాజ్. మరి ఆయన వండి వండిస్తున్న ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులు ఎలా ఆరగిస్తారో చూడాలి..