English | Telugu
టెంపర్ రివ్యూ
Updated : Feb 13, 2015
ఫ్యాన్స్ కోసమే కథలు రాసుకొంటున్న రోజుల్లో ఉన్నాం
ఫ్యాన్స్ హ్యాపీనా... సినిమా హ్యాపీ!
ఫ్యాన్స్‌కి నచ్చేలా సినిమా తీసి, వాళ్ల దగ్గర మార్కులు కొట్టేస్తే చాలు.. బండి నడిపేయొచ్చు. అన్న లెక్కల్లో బతికేస్తున్నాం!
ఫ్యాన్స్‌కి ఫైట్సు కావాలి, హీరోయిజం కావాలి, డాన్సులు కావాలి, రొమాన్స్ కావాలి, ఐటెమ్ సాంగ్ కావాలి..
అవన్నీ కలగలిపి రంగరించి.. పూరి ఓ ఆవకాయ్ ముద్ద తయారు చేశాడు... అదే టెంపర్.
.. టెంపర్ కథ కొంచెం చెప్పుకొందాం!
ఓ అవినీతి పోలీసు దయ (ఎన్టీఆర్). మనోడికి లేనిదే దయ. డబ్బు కోసం ఎంతటి నీచమైనా చేస్తాడు. వాల్తేరు వాసు (ప్రకాజ్ రాజ్) అక్రమాలకు మడుగులు ఒత్తుతాడు. శాన్వి (కాజల్)తో ప్రేమాయణం కూడా ఉంది. ఒకానొక సందర్భంలో శాన్వి కోసం దయా మారతాడు. వాల్తేరు వాసు తాట తీస్తాడు. మంచి పోలీస్ అయిపోతాడు. అదీ కథ.
దయా ఎంత దుర్మార్గుడో చెప్పడంతో ఫస్టాఫ్ పూర్తవుతుంది.
విలన్‌తో గొడవ పెట్టుకొని ఛాలెంజ్‌లు విసురుకొంటే అదే ఇంట్రవెల్ కార్డు!
మారి సమాజానికి మంచి చేయడం ముగింపు
మరి మధ్యలో ఏముందయ్యా అంటే.... ఎన్టీఆర్ ఉన్నాడు. ఇంత రొటీన్, ఫక్తు కమర్షియల్, లాజిక్ లెస్ కథకు ఎన్టీఆర్ నటనే జీవం పోసింది. ఎన్టీఆర్ నటనే కాస్త నడకలు నేర్పింది. ఎన్టీఆర్ నటనే నిలబెట్టింది. ఈ సినిమాకి కర్త, కర్మ, క్రియఅన్నీ తానై అయి నిలబెట్టాడు ఎన్టీఆర్. ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్టీఆర్ కాకుండా మరే ఇతర హీరో చేసినా ఈ సినిమాకి తొలి ఆటకే డిజాస్టర్ టాక్ వచ్చేసేదేమో. కాకపోతే.. ఈ సినిమాలో ఎన్టీఆర్ మాట్లాడింది తక్కువ, అరిచింది ఎక్కువ. డబ్బింగ్ కోసం ఎన్ని రోజులు సమయం తీసుకొన్నాడో ఏమోగానీ, ప్రతీ డైలాగ్ అరిచే చెబుతాడు. ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్ పూర్తిగా మారిపోయింది. ఎంత గా అంటే `ఏంటి మరీ ఇంత ఓవర్‌గా ఉంది..` అనుకొంటారు మొదట్లో. తరవాతర్వాత సర్దుకొని భలే ఉందే అనిపిస్తుంది. ఇక డాన్సులు.. ఎప్పుడో మూలన పడేసిన అస్త్రాలను మళ్లీ బయటకు తీసినట్టు డాన్సుల్లో మాత్రం రెచ్చిపోయాడు. కోర్టు సన్నివేశంలో ఎన్టీఆర్ నటన పీక్స్ అనిచెప్పొచ్చు. ఎన్టీఆర్‌లోని అసలు సిసలు పెర్‌ఫార్మర్ బయటకు వచ్చి బుసలు కొట్టాడు. పోసాని - ఎన్టీఆర్‌ల మధ్య నడిచే సన్నివేశాలు కూడా సూపర్బ్ అనిపిస్తాయి.
దయా మార్పు రొటీన్ గా అనిపిస్తుంది. కోర్టు సీన్ సూపర్బ్‌గా ఉన్నా, లాజిక్‌లకు దూరంగా సాగింది. మెయిన్ విలన్ ప్రకాష్‌రాజ్ ని వదిలేసి.. సైడ్ విలన్లని చంపేశాడు. మరి ప్రకాష్‌రాజ్‌ని ఎందుకు వదిలేసినట్టు...??? దయాలో మార్పు మొదలయ్యాక.. విలన్ ఇచ్చిన ఇంట్లోనే ఎందుకున్నట్టు.??? ఒక్కరోజులో కేసు ముగించి, మరుసటి రోజు ఉరిశిక్ష విధించడం అనే పాయింట్ చెప్పడానికి, రాయడానికి బాగున్నా.. నిజంగా ఇది మన దేశంలో సాధ్యమా..???? ఇలాంటివన్నీ పట్టించుకొంటే బుర్రపాడైపోతుంది బాబూ...! సినిమా అంతా సీరియస్‌గా సాగింది. పూరి కామెడీ చేద్దామనుకొన్నప్పుడల్లా వికారం వచ్చేసింది. అలీ, సప్తగిరి, కోవై సరళ, వెన్నెల కిషోర్ ఇంతమంది ఉన్నా పూరి వినోదం పండించలేకపోయాడు. పూరి సినిమాలో కామెడీ మిస్సయిన సినిమా ఏదైనా ఉందంటే అది ఇదే. కాజల్‌ని పాటలకు, దయా పాత్రలో మార్పునకూ మాత్రమే వాడుకొన్నారు. మా జంతువులు క్రాసింగ్ కి వచ్చాయ్ అనే డైలాగు, నా కాబోయే భార్యనీ కుక్కలానే చూస్తా అనే డైలాగ్ మరీ టూమచ్.
ముందే చెప్పినట్టు ఎన్టీఆర్ అదరగొట్టాడు. యాక్టింగ్ స్కిల్స్ అన్నీ బయటకు తీశాడు. ఈ సినిమా ఎన్టీఆర్ కోసమే చూడాలి... అన్నంత రేంజులో నటించాడు. ఆ తరవాత పోసాని కృష్ణమురళి పాత్ర ఆకట్టుకొంటుంది. వీళ్లిద్దరికీ మధ్య నడిచే సన్నివేశాలు, డైలాగ్స్ బాగున్నాయి. వాల్తేరు వాసుగా ప్రకాష్ రాజ్ నటన రొటీన్‌గా సాగింది. ఆ మాటకొస్తే.. మిగిలిన పాత్రలన్నీ రొటీన్ కొట్టుడే. మధురిమ క్యారెక్టర్ అంతంత మాత్రమే. అనూప్ అందించిన రెండు పాటలు బాగున్నాయి. మణిశర్మ ఆర్.ఆర్‌తో ప్రాణం పోశాడు. ఎమోషన్ సీన్స్ అంతాగా ఎలివేట్ అవడానికి కారణం మణి ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోరే. పూరి మాటల్లో పంచ్ అంతగా వినిపించలేదు. వక్కంంతం వంశీ రాసుకొన్న కథలో క్లైమాక్స్ మినహా.. మిగిలినదంతా రొటీనే.
ఎన్టీఆర్ మానియాతో ఊగిపోయే ప్రతి ఫ్యాన్‌కీ ఈ సినిమా నచ్చుతుంది. ఎందుకంటే... ఈ సినిమా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసమే డిజైన్ చేసినట్టు తీశాడు పూరి. రామయ్యా వస్తావయ్యా, రభస సినిమాలకంటే టెంపర్ సో సో బెటర్. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి కావల్సినంత కిక్ ఇస్తుంది.