English | Telugu
ఓ మంచి సినిమా ఉంటే పడేద్దురూ... ప్లీజ్!
Updated : Nov 11, 2014
తెలుగు ప్రేక్షకులు చాలా మంచోళ్లు. వాళ్లకు అద్భుతాలక్కర్లెద్దు. ఓ మంచి సినిమా చాలు. మంచి సినిమా అంటే కె.విశ్వనాథ్‌లానో, లేదంటే బాపూలానో కళాఖండాలు తియ్యాలేమో అనుకొనేరు. భరణిలా మిథునం తీసినా అదే పది వేలు అనుకొని ముచ్చటపడిపోతారు. అంత మంచోళ్లు...! అయితే ఈమధ్య మొహం మొత్తేసింది. తనివితీరా చూద్దాం, రికార్డులు కట్టబెడదాం, సూపర్ హిట్ చేసేద్దాం అనుకొంటే ఒక్క సినిమా కూడా రాదేం..??! గత ఆరు నెలల్లో చిత్రసీమలో భారీ హిట్ ఒక్కటీ లేదాయె. అన్నీ ఓ మాదిరి సినిమాలే. ఈ మధ్య గుంపు గుంపుగా సినిమాలొచ్చేస్తున్నా ఒక్క సినిమాలోనూ మేటర్ లేదు. సినిమా సక్సెస్ మీట్లూ, గ్రాండ్ సక్సెస్ మీట్లు జరుగుతున్నా... అవన్నీ నామ్‌కే వస్తే మాత్రమే. ''బాబ్బాబూ... ఒక్క మంచి సినిమా ఉంటే పడేద్దురూ.. ప్లీజ్'' అని మొహం వాచిపోయేలా అడుగుతున్నారు.
ఔను.. తెలుగు సినిమా నికార్సయిన హిట్ చూసి చాలాకాలం అయ్యింది. దృశ్యం, మనం.. మనవాళ్లకు కాస్త కొత్తగా అనిపించాయి. దృశ్యం తక్కువ బడ్జెట్‌లో లాగించిన ఓ ప్రయోగాత్మక చిత్రం. బడ్జెట్ కంట్రోల్‌లో పెట్టుకొన్నారు కాబట్టి లాభాలతో గట్టెక్కింది. అదే వెంకటేష్ ఇది వరకటి సినిమాల్లా భారీగా తీస్తే... ఆ సినిమా కూడా నిర్మాతకు నష్టాలుమిగులుద్దును. 'మనం' నిజంగా ఓ క్లీన్ హిట్. అక్కినేని నాగేశ్వరరావు చివరి సినిమా అనే సింపతీ ఫ్యాక్టర్ బాగా వర్కవుట్ అయ్యింది. కథ, కథనాలు కొత్తగా ఉండడంతో క్లాసూ, మాసూ అని తేడా లేకుండా ఈ సినిమాని హిట్ చేశారు. అయితే రూ.50 కోట్ల క్లబ్‌లో చేరాల్సిన సినిమా ఇది. నాగార్జున రాంగ్ ఫార్ములా వల్ల ఆ క్లబ్‌లో చేరలేదు. తక్కువ థియేటర్లలో సినిమా విడుదల చేసి తప్పు చేశాడు నాగ్. లేదంటే కచ్చితంగా రూ.60 కోట్లు వసూలు చేసేదేమో..?? ఏదైతేనేం.. ఇద్దరు టాప్ హీరోలు రెండు హిట్లు కొట్టారు. రన్‌రాజారన్, గీతాంజలి సినిమాలు ఒకే అనిపించాయి. ఊహలు గుసగుసలాడే పాసైపోయింది. లౌక్యం మెల్లిగా హిట్ టాక్ తెచ్చేసుకొంది. ఇవి మినహాయిస్తే అటు ప్రేక్షకులకు, ఇటు నిర్మాతలకు పూర్తి స్థాయిలో సంతృప్తినిచ్చిన సినిమా లేదనే చెప్పాలి.
ఈవారం విడుదలైన బ్రదరాఫ్ బొమ్మాళీ, జోరు, జైహింద్ 2 ప్లాప్ లిస్టులో చేరిపోయాయి. దిక్కులు చూడకు రామయ్యా, ఒక లైలా కోసం, పూజ, రోమియో, అనుక్షణం, బూచమ్మ బూచోడు, రౌడీ.... ఇలా తెలుగునాట ఎన్ని ఫ్లాపులో..?? గోవిందుడు అందరివాడేలే సినిమా హిట్టని మెగా ఫ్యామిలీ ఫ్యాన్సే గుండెల మీద చేయి వేసుకొని చెప్పలేని పరిస్థితి. ఇక ఆగడు, రభస ఎన్ని విధ్వంసాలు సృష్టించాయో మనందరికీ తెలుసు. బాక్సాఫీసు దగ్గర సరైన సినిమా లేక ప్రేక్షకులు ఆవురావురమంటూ చూస్తున్నారు. కరెంటు తీగ, కార్తికేయ.. ఇవన్నీ ఓ మాదిరి సినిమాలే. కానీ.. ప్రేక్షకులు ఆదరించారు. వీటికి లాభాలొచ్చాయి. కారణం.. బాక్సాఫీసు దగ్గర సరైన సినిమా లేకపోవడమే. ఓ మంచి సినిమా పడేయండ్రా బాబూ... హిట్ చేసి చూపిస్తాం అంటున్నారు.
పరిశ్రమకు ఫ్లాపులూ, ఏవరేజ్‌లూ, హిట్లూ మామూలే. అప్పుడప్పుడూ ఇండ్రస్ట్రీ రికార్డులు షేకైపోయే ఓ బ్లాక్ బ్లస్టర్ రావాలి. అది టాప్ హీరోల వల్లే సాధ్యమవుతుంది. ఈయేడాది పెద్ద హీరోల సినిమాలేం రావడం లేదు. సో.. ఇండ్రస్ట్రీ రికార్డులు బద్దలైపోయే ఛాన్స్ లేదన్నమాట. అయినా ఫర్లేదు... మంచి సినిమా, జనం మళ్లీ మళ్లీ చూసే సినిమా, తెలుగువాడు కాలరెత్తుకొనే సినిమా ఒకటొస్తే బాగుణ్ణు. మరి అలాంటి సినిమా ఎప్పుడొస్తుంది?? ఎవరు తీస్తారు...? 2014లో చూస్తామంటారా?? వెయిట్ అండ్ సీ.