English | Telugu
షాపింగ్ మాల్ పై కాజల్ పోలీస్ కేసు?
Updated : Jan 16, 2015
సినిమాల ద్వారా ఎన్ని కోట్లు సంపాదిస్తున్నా హీరోయిన్లకు నగల దుఖాణాలు, షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవాలకు పిలిస్తే కాదనకుండా వస్తుంటారు. ఎందుకంటే ఒక అరగంట కార్యక్రమానికి హాజరయినా కూడా వారికి నిర్వాహకులు భారీగా ముట్టజెప్పుతారు. కాజల్ అగర్వాల్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఈమధ్యనే హైదరాబాద్ లో ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ఆమె ఒకే చెప్పారు. దానితో సదరు షాపింగ్ మాల్ వారు కాజల్ అగర్వాల్ తమ బ్రాండ్ అంబాసడర్ అంటూ ఊరంతా ఆమె ఫోటోతో ఉన్న పెద్దపెద్ద హోర్డింగులు పెట్టేసుకొన్నారు. కానీ ఆఖరినిమిషంలో కాజల్ ఏదో కారణం చేత ఆ కార్యక్రమానికి హాజరు కాలేకపోవడంతో సదరు షాపింగ్ మాల్ వారు వేరే హీరోయిన్ని తీసుకువచ్చి ఆ తంతు పూర్తి చేసేసారు. తను రాకపోతే ప్రారంభోత్సవం వాయిదా పడుతుందనుకొంటే, వేరే ఎవరినో పెట్టి ఆ కార్యక్రమం ముగించేయడంతో కాజల్ అగర్వాల్ కొంచెం షాక్ తిని ఉండవచ్చును. సదరు షాపింగ్ మాల్ యాజమాన్యం తన అనుమతి లేకుండా తన ఫోటోలతో కూడిన హోర్డింగులను పెట్టుకొని తనను వారి బ్రాండ్ అంబాసడర్ గా చెప్పుకోవడంపై ఆమె తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. తక్షణమే ఆ హోర్డింగులు తొలగించి తన అనుమతి లేకుండా తన పేరు, ఫోటో వాడుకొన్నందుకు ఎంతో కొంత ముట్టజెప్పమని సదరు షాపింగ్ మాల్ యాజమాన్యాన్ని కోరినట్లు తాజా సమాచారం. లేకుంటే పోలీసులకు పిర్యాదు చేసేందుకు కూడా వెనుకాడబోనని ఆమె హెచ్చరించినట్లు తెలుస్తోంది.