English | Telugu
ఎన్నాళ్లకెన్నాళ్లకు అనుష్క సినిమా వస్తుంది!
Updated : Jul 3, 2023
అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి జంటగా పి.మహేష్ బాబు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'. అన్విత రవళి శెట్టి పాత్రలో అనుష్క, స్టాండప్ కమెడియన్ సిద్ధు పొలిశెట్టి పాత్రలో నవీన్ పొలిశెట్టి నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రధన్ సంగీత దర్శకుడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ కి, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం చూడాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ని ప్రకటించారు మేకర్స్.
'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' చిత్రాన్ని ఆగస్ట్ 4న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నట్లు తెలుపుతూ తాజాగా మేకర్స్ ఓ పోస్టర్ ను వదిలారు. హీరోహీరోయిన్లతో రూపొందించిన ఈ పోస్టర్ కలర్ ఫుల్ గా క్యూట్ గా ఉంది.
యువీ క్రియేషన్స్ బ్యానర్‌లో 'భాగమతి' తర్వాత అనుష్క నటిస్తోన్న చిత్రమిది. తెలుగులో అనుష్కకు స్టార్ ఇమేజ్ ఉంది. అయితే ఆమె 'బాహుబలి-2' తర్వాత సినిమాలు బాగా తగ్గించారు. ఆమె చివరిగా ప్రధాన పాత్ర పోషించి థియేటర్ లో సందడి చేసిన చిత్రం 'భాగమతి'(2018). ఆమె నటించిన 'నిశ్శబ్దం'(2020) నేరుగా ఓటీటీలో విడుదలైంది. అందుకే విరామం తర్వాత అనుష్క నుంచి వస్తున్న సినిమా కావడంతో 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'పై అభిమానుల్లోనూ, ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది.
మరోవైపు ఈ సినిమాకి నవీన్ పొలిశెట్టి రూపంలో మరో ఆకర్షణ ఉంది. 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ', 'జాతిరత్నాలు' ఘన విజయాలు సాధించడంతో.. కేవలం రెండు సినిమాలకే తెలుగునాట మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నవీన్. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'తో హ్యాట్రిక్ అందుకుంటారనే అంచనాలు ఉన్నాయి. మరి ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం అనుష్కకి, నవీన్ కి ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.