English | Telugu
ఇది రామ్ చరణ్ రేంజ్.. కళ్లుచెదిరే ధరకు 'పెద్ది' ఓటీటీ డీల్..!
Updated : Jun 17, 2025
ఓటీటీ బిజినెస్ బాగా పడిపోయింది అనేది కొంతకాలంగా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. విడుదలకు దగ్గరవుతున్న సినిమాల ఓటీటీ డీల్స్ కూడా క్లోజ్ అవ్వట్లేదని, కొందరు స్టార్స్ కి సైతం ఈ పరిస్థితి తప్పట్లేదని అంటున్నారు. అలాంటిది వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానున్న 'పెద్ది' (Peddi) మూవీ ఓటీటీ డీల్ అప్పుడే క్లోజ్ అయిందనే వార్త ఆసక్తికరంగా మారింది.
రామ్ చరణ్ (Ram Charan) హీరోగా 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'పెద్ది'. వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా 2026 మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. పెద్ది చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా గ్లింప్స్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. అందులోని క్రికెట్ షాట్ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అయింది. గ్లింప్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో పెద్ది బిజినెస్ కి భారీ డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా డిజిటల్ రైట్స్ కోసం ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ.110 కోట్లకు డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. విడుదలకు 9 నెలలకు పైగా సమయముండగానే.. ఇంతటి భారీ ధరకు ఓటీటీ డీల్ క్లోజ్ అవ్వడమనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.
'ఆర్ఆర్ఆర్'తో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. ఆ తర్వాత చరణ్ నుంచి వచ్చిన 'ఆచార్య', 'గేమ్ ఛేంజర్' సినిమాలు మెప్పించలేకపోయాయి. దాంతో 'పెద్ది'పైనే ఆశలు పెట్టుకున్నాడు. చరణ్ కెరీర్ లో 'రంగస్థలం' తరహాలో 'పెద్ది' కూడా ప్రత్యేకంగా నిలుస్తుందని ఫ్యాన్స్ కూడా బలంగా నమ్ముతున్నారు. గ్లింప్స్ సైతం ఆ నమ్మకాన్ని కలిగించింది. ఇక ఇప్పుడు భారీ ఓటీటీ డీల్ ఆ నమ్మకాన్ని రెట్టింపు చేస్తోంది. నెట్‌ఫ్లిక్స్ అంటే గ్లోబల్ రీచ్ ఉంటుంది. కంటెంట్ బాగుంటే.. 'ఆర్ఆర్ఆర్' బాటలో 'పెద్ది' కూడా పయనించి.. మరోసారి చరణ్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయేలా చేస్తుంది అనడంలో సందేహం లేదు.