English | Telugu

శంక‌ర్‌కి హ్యాండిచ్చింది ఎవ‌రు??

శంక‌ర్ అంటే చెప్ప‌లేనంత క్రేజ్‌. ప్ర‌స్తుతానికి భార‌త‌దేశ‌మంతా చ‌ర్చించుకొనే క్రేజీ ద‌ర్శ‌కుల‌లో శంక‌ర్ ఒక‌డు. ఆయ‌నతో సినిమా చేయాలని టాప్ స్టార్స్ ఆస‌క్తిగా ఎదురుచూస్తుంటారు. శంక‌ర్ పిలుపు కోసం ఒళ్లంతా చెవులు చేసుకొని మ‌రీ ఎదురుచూస్తుంటారు. అలాంటిది శంక‌ర్ సినిమా చేస్తానంటే కాద‌న్న హీరోలూ ఉన్నారా?? అదీ మ‌న తెలుగులో...?! కానీ ఇది నిజం. శంక‌ర్ తెలుగులో నేరుగా ఓ సినిమా చేయాల‌ని రెండు సార్లు ప్ర‌య‌త్నించి విఫ‌ల‌మ‌య్యాడు. ఈ విష‌యాన్ని శంక‌రే స్వ‌యంగా చెప్పాడు. ఆ హీరోలెవ‌రు? శంక‌ర్‌తో సినిమా ఛాన్స్ కోల్పోయిన దుర‌దృష్ట‌వంతులెవ‌రు అంటూటాలీవుడ్‌లో ఆస‌క్తిగా చ‌ర్చించుకొంటున్నారు. శంక‌ర్ అవ‌కాశాన్ని బేఖాత‌రు చేసిన హీరో మాత్రం.. మ‌హేష్ బాబు. అదెలాగంటారా?? బాలీవుడ్‌లో ఘ‌న విజ‌యం సాధించిన త్రీఇడియట్స్ సినిమాని తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఒకేసారి రీమేక్ చేద్దామ‌నుకొన్నాడు శంక‌ర్‌. తమిళంలో విజ‌య్‌, తెలుగులో మ‌హేష్ బాబుల‌ను హీరోలుగా అనుకొన్నాడు. అయితే ఈ ఆఫ‌ర్‌ని మ‌హేష్ కాద‌న్నాడు. రీమేక్ సినిమాల్ని చేయ‌డం ఇష్టం లేక‌పోవ‌డం ఒక కార‌ణ‌మైతే, అప్ప‌టికి మ‌హేష్ బిజీ బిజీగా ఉండి, కాల్షీట్లు స‌ర్దుబాటు చేయ‌క‌పోవ‌డం మ‌రో కార‌ణం. ఈ విష‌యాన్ని మహేష్ కూడా ఓ సంద‌ర్భంలో ప్ర‌స్తావించాడు. అయితే మ‌హేష్ తీసుకొన్న నిర్ణ‌యం స‌రైన‌దే అని త‌ర‌వాత తెలిసింది. త‌మిళ రీమేక్ ప‌రాజ‌యం పాలై శంక‌ర్‌కి తొలి ఫ్లాప్‌ని రుచి చూపించింది. అంత‌కు ముందు అంటే.. జెంటిల్‌మెన్ రోజుల్లో శంకర్ ఓ క‌థ ప‌ట్టుకొని తెలుగులో ఓ టాప్ స్టార్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చాడట‌. శంక‌ర్ ఆలోచ‌న‌లు మ‌రీ.. భారీగా ఉన్నాయ‌ని భ‌య‌ప‌డిన ఆహీరో ఆ స్కిప్టుని ప‌క్క‌న పెట్టాడ‌ట‌. అంత పెట్టుబ‌డి పెట్ట‌డానికి నిర్మాత‌లు వెనుకంజ వేశార‌ట‌. దాంతో త‌మిళంలోనే ఆ సినిమాని తెర‌కెక్కించాడు శంక‌ర్‌. అలా రెండుసార్లు తెలుగులో నేరుగా సినిమా తీసే ఛాన్స్ మిస్స‌య్యాడు. ఈసారి మాత్రం ఆ పొర‌పాటు జ‌ర‌గ‌దు. ఎందుకంటే ఆయ‌న‌తో సినిమా చేయాల‌ని తెలుగు హీరోలంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. నాకూ తెలుగులో ఓ సినిమా చేయాల‌ని వుంది అని శంక‌ర్ కూడా త‌న మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టాడు. సో.. శంక‌ర్ తెలుగు సినిమా ఖాయ‌మైపోయిన‌ట్టే.