English | Telugu
సౌఖ్యం రివ్యూ
Updated : Dec 24, 2015
ఇష్టమొచ్చిన కథ రాసుకొని, నచ్చినట్టు తీసుకోవడంలో తప్పేం లేదు.
కాకపోతే.. అలాంటి సినిమాల్ని ఇంట్లోనే చూసుకోవాలి.. థియేటర్లోకి వదిలితే జనం ఏమైపోతారు?
టికెట్టు కొన్న పాపానికి శిక్ష అనుభవించడం తప్ప - వాళ్లేం చేస్తారు?
ప్రేక్షకుడు ఆశా జీవి. ఇది కాకపోతే దీని తరవాతి సన్నివేశమైనా బాగుంటుంది కదా అన్న ఆశతో చివరి వరకూ ఎన్ని హింసలైనా భరిస్తాడు.
భరిస్తున్నాడు కదా.. అని ప్రతీ సీనులోనూ హింస పెడితే.. చివరి వరకూ.. వాడ్ని రాచి రంపాలు పెడితే.. ఆ సినిమాకి మొహమాటం లేకుండా షార్ట్ కట్‌లో సౌఖ్యం అని పేరు పెట్టేయొచ్చు.
కథలోకి వెళ్తాం.. శ్రీను (గోపీచంద్) అన్ని తెలుగు సినిమాల్లోని హీరోలానే బేవార్స్.
శైలజ (రెజీనా)ని తొలి సీన్‌లోనే ప్రేమించేస్తాడు. ఆ సీను మాత్రం నాలుగైదుఆరేడు ఎనిమిది సన్నివేశాంల లెంగ్తీగా ఉంటుందనుకోండి - అది వేరే విషయం.
శైలు కూడా 'నో' అంటే హీరో ఏమైపోతాడో అని బెంగ పెట్టుకొని `యస్` అనేస్తుంది.
ఇక్కడ మరీ పరమ చెత్త రొటీన్ ట్విస్ట్ ఏంటంటే.. ఆ హీరోయిన్‌కి ఆల్రెడీ పెళ్లి ఫిక్సయిపోతుంది.
ఇంట్రవెల్‌లో ఏం తెలుస్తుందయ్యా అంటే.. హీరోయిన్ ఎవరో కాదు... కొలకొత్తాని ఓ ఆట ఆడించే పుడింగు గాడు పీర్ (దేవన్) కూతురని.
హైదరబాద్ ని చెడుగుడు ఆడుకొనే బావూజీ (ప్రదీప్ రావత్) కూడా శైలు కోసం వెదుకుతున్నాడని తెలుస్తుంది.
పీకే అనే పుడింగునీ, బావూజీ అనే ఉస్తాద్‌ని శ్రీనుగాడు ఏ రేంజులో ఆడుకొన్నాడన్నది 'సౌఖ్యం' స్టోరీ.
కొత్త కథ రాయాలంటే కచ్చితంగా బుర్రలు బద్దలు కొట్టుకోవాలి. అందుకే అంత రిస్క్ చేయరు మనోళ్లు. ఓరోజు ఇంట్లో కూర్చుని ఈటీవీ, జెమిని, మాటీవీలో వస్తున్న సినిమాల్నీ చూసేస్తే చాలు. అన్నీకలిపిన కిచిడీ కథ రాసుకోవచ్చు. సౌఖ్యం కూడా అలాంటి కథే.
అరె.. ఈ సీన్ కొత్తగా ఉందే... అనడానికి ఒక్కటీ ఉండదు.
అరె.. ఈ డైలాగ్ బాగుందే - అని చెప్పుకోవడానికి లేదు.
ఇక్కడ హీరో బాగా చేశాడు - అని మురిసిపోయే ఛాన్స్ ఇవ్వలేదు
ఇక్కడ హీరోయిన్ అదరగొట్టేసింది - అని ఆశ పడిపోవడానికి ఆస్కారమే లేదు.
ప్రతీ సీనూ.. ఏదో ఓ సినిమాలోంచి ఎత్తేసినట్టే అనిపిస్తుంది. ఉన్నది ఉన్నట్టుగా ఎత్తేసినా బాగుండేది. అందులో దర్శకుడు రవికుమార్ చౌదరి వేలు పెట్టి కెలకాలి కదా. అక్కడే.. సీను కాస్త తుస్సుమనిపోయేది. రైలు ఎపిసోడ్ తోనే ప్రేక్షకుడికి అర్థమైపోతుంది.. ఇక్కడ నుంచి జారుకొంటే సౌఖ్యంగా ఉంటుందని. కానీ ఆశ చావక కూర్చుంటే మాత్రం... సౌఖ్యం టీమ్ మొత్తానికి పలారంగా మిగిలిపోతాడు ప్రేక్షకుడు.
ఇది సినిమానా? స్నూఫ్‌లన్నీ కలసి కుట్టేశారా అనిపిస్తుంది. ఇటీవల హిట్టయిన అనేక సినిమాల్ని సెకండాఫ్ లో స్నూఫ్‌లుగా వాడేశాడు. ఏదో ఒకటీ రెండూ అంటే చూడ్డానికి బాగానే ఉంటాయి. ప్రతీ సీన్ కూడా అంతే. దాంతో దర్శకుడు స్వయంగా బుర్రపెట్టి రాసుకొన్న సీన్ కూడా స్నూఫ్ దృష్టితోనే చూడాల్సొచ్చింది. సెకండాఫ్ అంతా డ్రామానే. ఏమాత్రం రిహార్సల్స్ లేకుండా నాటకం వేస్తే ఎంత నీచంగా ఉంటుందో.. ఈ సినిమా ద్వితీయార్థం అలా ఉంటుంది. హీరో ఇంట్లో ఆడిన డ్రామా పరమ రొటీన్ గా సాగిపోతుంది. ఐటెమ్ సాంగ్ ఎందుకొస్తుందో తెలీదు. బ్రహ్మానందంపై తీసిన అంత్యాక్షరి ఎపిసోడ్ అరాచకానికి చిరునామాలా మిగిలిపోవడం ఖాయం.
సిక్స్ ప్యాక్ బాడీ, యాక్షన్ ఇమేజ్ సంపాదించుకొన్న గోపీచంద్ కామెడీ చేయాలనుకోవడమే పెద్ద కామెడీ అయిపోయింది. ఇక తన బలానికి తగిన కథల్ని ఎంచుకొంటే బాగుంటుంది. రెజీనా పాత్ర కూడా దండగే. పాటలకు తప్ప దేనికీ పనిచేయదు. బ్రహ్మానందం దగ్గర విషయం అయిపోయిందని ఈసినిమా మరోసారి రుజువు చేసింది. ఈమధ్య సినిమాల్ని తన పేరడీలతో గట్టెక్కిస్తున్న ఫృద్వీ కూడా ఏం చేయలేకపోయాడు. ఒకటా రెండా? ఈ సినిమాలోని పాత్రలన్నీ శుద్ధ దండగ వ్యవహారాలుగానే తయారయ్యాయి. అనూప్ కొట్టిందే కొట్టడం అలవాటు చేసుకొన్నాడు తమన్‌లా. ఈ సినిమాలోనూ అంతే. సినిమా రిచ్‌గా తీశారు.. కానీ లాభం ఏంటి? నాణ్యమైన సన్నివేశం ఒక్కటీ లేదు. రెండుగంటల పాటు ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టింది లౌక్యం.
ఫినిషింగ్ టచ్: మన సుఖాన్ని దూరం చేసిన... 'సౌఖ్యం'
రేటింగ్ : 1/5