English | Telugu
ఇవి చెత్త సినిమాలట
Updated : Apr 5, 2016
సినిమా..మూడు గంటల పాటు ప్రేక్షకుడికి వినోదాన్ని అందించడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. హాస్యం, ధ్రిల్లర్, సస్పెన్స్ ఇలా విభిన్న రకాలుగా సినిమాలు ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. దర్శకుల ప్రతిభ, నటీనటుల నటనా కౌశలం వీటి ఆధారంగా వారికి సముచిత గౌరవాన్ని అందించే లక్ష్యంతో సినీ పరిశ్రమలో గొప్ప గొప్ప అవార్డులంటూ చాలానే ఉన్నాయి. హాలీవుడ్లో ఆస్కార్, ఇండియాలో ఫిలింఫేర్ నుంచి నంది అవార్డ్ దాకా..ఆ మాట కొస్తే రకరకాల స్వచ్చంద సంస్థలు, చిన్నా చితకా సంస్థలు అందించే అవార్డులు లెక్కలేనన్ని ఉన్నాయి. అయితే ఇవన్నీ ఉత్తమ చిత్రం, ఉత్తమ నటన కేటగిరీ అవార్డులు. వీటికి భిన్నంగా సినిమా కలెక్షన్ల గురించ తప్ప, క్వాలిటీ గురించి ఆలోచించని దర్శక,నిర్మాతలు నటీనటుల్నీ చైతన్యవంతుల్ని చేసే దిశగా "గోల్డెన్ కేలా " పేరుతో బాలీవుడ్లో చెత్త అవార్డుల్ని ప్రకటిస్తున్నారు.
8వ గోల్డెన్ కేలా అవార్డుల ఫంక్షన్ ముంబైలో అట్టహాసంగా జరిగింది. షారూఖ్ ఖాన్, కాజోల్ నటించిన దిల్వాలే 2015 సంవత్సరానికి గానూ ఉత్తమ చెత్త చిత్రంగా ఎంపికైంది. భారీ స్టార్ కాస్టింగ్, పబ్లిసిటీ స్టంట్లు బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించినా ప్రేక్షకులు మాత్రం దీనిని చెత్త చిత్రంగా తేల్చేసారు. చెత్త నటుడిగా 'సూరజ్ పాంచోలీ'ని ఎన్నుకున్నారు. ప్రేమ్ రతన్ ధన్ పాయో సినిమాకి గానూ సోనమ్ కపూర్ ఉత్తమ చెత్త నటిగా, ఈ ఏడాది చెత్త పాటగా "ప్రేమ్ రతన్ ధన్ పాయో'' టైటిల్ సాంగ్ ఎంపికైంది. చెత్త దర్శకుడిగా సూరజ్ బర్ జాత్యా ఎంపికయ్యారు. బాలీవుడ్లో సరే కానీ టాలీవుడ్ పరిస్థితి ఏంటీ?. ఇక్కడ కూడా కేవలం కలెక్షన్లపై పెట్టిన దృష్టి సినిమా క్వాలీటి, కంటెంట్ విషయంలో దర్శక, నిర్మాతలు పెట్టడం లేదు. అందుకే తెలుగులో ఉత్తమ చెత్త చిత్రం, ఉత్తమ చెత్త నటుడు, ఉత్తమ చెత్త నటి, ఉత్తమ చెత్త దర్శకుడు విభాగాల్లో మీరు ఎవరికి అవార్డులు ఇస్తారు.