English | Telugu

సృష్టి క‌ర్త‌... బాపు

బాపు...
ఆ పేరు విన‌గానే కుంచె సంబ‌ర‌ప‌డుతుంది.
కెమెరా `క‌న్ను` స‌రిచేసుకొటుంది.
రంగులు హుషారుప‌డతాయి.

త‌న గీత‌ల‌తో ఎంద‌రినో స‌మ్మోహ‌ప‌రిచిన ఆయ‌న‌ని ఏదీ ప్ర‌లోభ పెట్ట‌లేదు. అన్నిటికీ అతీతుడుగా, త‌న‌దైన లోకంలో ఆనందంగా అవిశ్రంతంగా విహ‌రిస్తూ మ‌న‌ల్ని అల‌రించిన బాపు ఓ తాత్వికుడు!!
అస‌లెలా సాధ్యం ఆయ‌న‌కు?

వేలెడంత లేని బుడుగుని గీస్తారు.
చ‌క్క‌లిగిలిగిలిపెట్టి భ‌ళ్లున న‌వ్వించే కొంటె కార్టైన్లూ గీస్తారు.
వ‌య్యారి భామ‌ల సంగ‌తి స‌రేస‌రి.

వీట‌న్నింటితోపాటు ఆ దివిలో ఉండే దేవ‌త‌ల‌ను రంగు గీతల మ‌ధ్య బంధించి మ‌న క‌ళ్ల‌ముందు సాక్ష్యాత్క‌రింప చేస్తారే.. ఎంత అద్భుతం ఆ ప్ర‌తిభ‌??
ఎన్ని వేల‌సార్లు జోత‌లు ప‌ట్టాలి ఆ కుంచె ప‌ట్టిన చేతికి
ఆయ‌న ఊహ‌ల్లో మెదిలిన చిత్రం అచ్చం అలానే ప్రాణం పోసుకొని 70 ఎంఎం తెర‌పై డైలాగులు చెప్తొంటే అచ్చెరువు చెంద‌కుండా ఎలా ఉండ‌గ‌లం?
ప్ర‌తి ఫ్రేమూ కెమెరా కంటే ముందు ఆయ‌న కాగితంపై బంధీ కావ‌ల్సిందే.

బోసిన‌వ్వు .. ప‌సివాళ్ల‌కే సొంత‌మైన సొత్త‌ది. వ‌య‌సుతో పాటు క‌రిగి కాలంలో క‌లిసిపోతుంది.కానీ అదేం చిత్ర‌మో... ఆ న‌వ్వు నన్నోద‌ల‌కు ప్లీజ్ అంటూ.. ఆయ‌న‌తో పాటు చివ‌రిదాకా స్నేహం చేసింది. ఎంతందంగా ఉంటుందా న‌వ్వు..?! ఎంత స్వ‌చ్ఛంగా ఉంటుందా న‌వ్వు..? అచ్చం ప‌సివాడి పాల న‌వ్వులా ఆయ‌న ప‌సిమ‌న‌సుకు అద్దం ప‌డుతూ.

ప‌ని.. ప‌ని.. ప‌ని, అదే ఊపిరి, దైవం. అల‌సిపోయేది ప‌నితోనే, సేద తీరేది ప‌నిలోనే. అదేంటో...?! ప‌నిలోనే ఆనందం ఉందంటారు. మ‌నం ఆ మాట విన్నాం. కానీ అది ఆయ‌న రుచి చూశారు. అందుకే ఇంత ఆస్తి మ‌న‌కు ఇవ్వ‌గ‌లిగారు. ఒక‌టా రెండా? ఎన్నెన్ని బొమ్మ‌లు. ఎన్నెన్ని కార్ట్యూన్లు, ఎన్నెన్నో సినిమాలు. ఒక జీవిత కాలంలో ఇంత సృష్టా?? సాధ్య‌మే అన‌డానికి నిలువెత్తు సాక్ష్య౦ ఆయ‌న మ‌న‌కు అందించిన సృష్టి. బ్ర‌హ్మ‌లా తాను సృష్టించ‌డానికే పుట్టారు. అందుకే త‌పస్సులా దాన్ని కొన‌సాగించారు.. చివ‌రి దాకా.

'రాజీ' కి బాపు అంటే చ‌చ్చేంత భ‌యం.
అందుకే ఆయ‌న ద‌రిదాపుల్లోకే రావ‌డానికి భ‌య‌ప‌డింది. ఒక్క‌సారైనా ఆయ‌న్ని వ‌శ‌ప‌రుచుకోవాల‌ని ఆశ ప‌డింది. కానీ ఓడిపోయింది. అది చిన్న కార్టూన్‌ కావ‌చ్చు. నిలువెత్తు దేవ‌తా మూర్తి కావ‌చ్చు. ఓ పుస్త‌క ముఖ చిత్రం కావ‌చ్చు. త‌న సినిమాలో ఓ ఫ్రేమ్ కావ‌చ్చు. ఎక్క‌డా 'రాజీ' ప్ర‌స‌క్తే లేదు.

ఆత్మీయ‌త అనుబంధం క‌ల‌గ‌లిస్తే మా బాపు అంటూ ఎవ‌రికి వారే.. ఆ పేరునీ, మ‌నిషినీ గుండెల్లో బంధీ చేసేశారు. ఈయ‌న నా సొంతం, అచ్చంగా నా సొంత‌మే అనుకోవ‌డంలో ఎంత ఆనందం ఉంటుందో తెలుగువాళ్లంద‌రికీ తెల్సు. బాపు గురించి మాట్లాడాలీ అంటే.. ఒక్క బాపు అంటే అసంపూర్ణంగా అనిపిస్తుంది. ఒక్క ఆత్మ రెండు రూపాల్లో జీవం పోసుకొని మ‌న క‌ళ్లెదుట నిలిస్తే 'బాపు ర‌మ‌ణ‌లు' అవుతారు. ఒక‌రు గీత మ‌రొక‌రు రాత‌!!
ఆ గీత ఆ రాత‌ను ఉత్సాహ‌ప‌రిచిందో
ఆ రాత ఆ గీత‌ను క‌వ్వంచిందో... అద్భుత‌మైన స్స‌ష్టి జ‌రిగిపోయింది
ఏమైనా మ‌నం అదృష్ట వంత‌లు. ఆ ఇద్ద‌రూ మ‌న సొంతం.
బాపు లేరంటే మ‌న‌సొప్పుకోదు.

బుడుగు హ‌న్నా అంటాడు.
గ్యాన పెసూనాంబ అలిగి అన్నం తిన‌దు.
వయ్యారి భామ‌లు అలంక‌రించుకోరు.
ఆ దేవ‌ర భువిలో నాకేం ప‌ని అంటాడు.
అందుకే బాపు ఉన్నారు.. మ‌న‌తోనే ఉన్నారు. ''మ‌న ప‌ని నిల‌బ‌డాల‌య్యా.. మ‌న‌కొచ్చిన బిరుదులు కాదు'' అనే ఆయ‌న మాట‌లు నిజం చేస్తూ మ‌న‌తో పాటు ఎప్ప‌టికీ నిలిచిపోయే చిరంజీవి మ‌న బాపు...!!

.....రమ ఇరగవరపు