English | Telugu
నా స్థానంలో ఎవరున్నా సూసైడ్ చేసుకుంటారు!
Updated : Jan 2, 2023
దిల్ రాజుకు సినిమా కథ విన్న వెంటనే బాగా జడ్జి చేయగలిగిన సత్తా ప్రతిభ ఉన్నాయి అని చాలామంది నమ్ముతారు. అలాగే ఒక మూడు నాలుగు ఏళ్ల కిందట కూడా ఆయన జడ్జిమెంట్ అంటే దానికి తిరిగే లేదనే నమ్మకం ఉండేది. అయితే ఈ మధ్య వరుసగా కొన్ని పరాజయాలు చవిచూసిన తర్వాత ఆయనలో మునుపటి జడ్జిమెంట్ తగ్గిందని కామెంట్లు వస్తున్నాయి. నాడు ఆహా దిల్ రాజు జడ్జిమెంట్ అద్భుతం అన్నవారే నేడు దిల్ రాజు పరిస్థితే అలా ఉంటే ఇక మా పరిస్థితి ఇంకేమిటి అని జోకులు వేసుకుంటూ ఉంటున్నారు. ఇక విషయానికొస్తే టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్న దిల్ రాజు ప్రస్తుతం కోలీవుడ్ మార్కెట్ పై కూడా దృష్టి పెట్టారు. నిర్మాతగానే కాకుండా ఆయన డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ రంగాలలో కూడా పాగా వేశారు. తాజాగా ఆయనపై కొందరు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు.
వారసుడు సినిమాకు సంబంధించిన థియేటర్ల విషయంలో ఆయన చాలామందికి టార్గెట్ అవుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దిల్ రాజు మాట్లాడుతూ ఇండస్ట్రీలో ఎవరి బిజినెస్ వారిదే. కంటెంట్ ఉన్నవాడు ఇక్కడ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ చూస్తాడు. ఈ సినిమా ప్రపంచంలో కొన్ని సార్లు అపజయాలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటిని తట్టుకొని ముందుకు వెళ్లే సత్తా కూడా ఉండాలి. ఒక తరుణంలో నేను మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ సినిమాలతో దారుణమైన ఆర్థిక పరిస్థితులను చవిచూశాను. మహేష్ బాబు- మురుగదాసుల కాంబినేషన్లో వచ్చిన స్పైడర్ సినిమా హక్కులను నైజాంకు భారీ ధరకు కొనుగోలు చేశాను.
ఇక అదే ఎడాది అజ్ఞాతవాసి నైజాం హక్కులకు పోటీపడి మరీ దక్కించుకున్నాను. అవి నాకు భారీ నష్టాలను తీసుకుని వచ్చాయి. దారుణమైన ఆర్ధిక పరిస్థితులను చవిచూసి దారుణమైన జీవితం రుచిచూశాను. అయితే అదే సమయంలో కొన్ని చిన్న సినిమాలు నన్ను ఆదుకున్నాయి. నేను తీసిన కొన్ని చిన్న సినిమాలు బాగా ఆడటంతో ఆ నష్టాల శాతాన్ని తగ్గించుకున్నాను. దాంతో ఆ రెండు పెద్ద సినిమాలు దెబ్బకొట్టినా తట్టుకోగలిగాను. ఆ స్థానంలో మరొక డిస్ట్రిబ్యూటర్, నిర్మాత ఉండి ఉంటే సూసైడ్ చేసుకునేవారు. లేదంటే ఇండస్ట్రీ నుంచి పారిపోయేవారు... అని దిల్ రాజు సమాధానం ఇచ్చారు. మొత్తానికి దిల్‌రాజు కూడా సినిమా వ్యాపారం అనేది జూదమని ఇండైరెక్ట్ గా చెబుతున్నారని అర్థమవుతోంది...!