English | Telugu
చూపులన్నీ సందీప్ రెడ్డి వంగాపైనే!
Updated : Jan 2, 2023
తొలి సినిమా అర్జున్ రెడ్డి రిలీజ్‌కి ముందు ఈ దర్శకుడిని ఎవరూ పట్టించుకోలేదు. కానీ సినిమా రిలీజైన తర్వాత టాలీవుడ్ ఏంటి అన్ని చిత్ర పరిశ్రమలు డైరెక్టర్ ఎవరా అని వెతికాయి.. అతనెవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. సందీప్ రెడ్డి వంగా. ఈ డైరెక్టర్ అర్జున్ రెడ్డి చిత్రం ద్వారా విజయ్ దేవరకొండని స్టార్‌గా నిలబెట్టాడు. ఇదే చిత్రాన్ని బాలీవుడ్‌లో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి ఏకంగా రూ.300 కోట్ల క్లబ్‌లో జాయిన్ అయ్యారు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ చిత్రాలు రెండూ బ్లాక్ బస్టర్సే కానీ.. డైరెక్టర్‌గా సందీప్ వంగాకి మాత్రం తెలియని టార్గెట్ క్రియేట్ అయ్యింది. దీంతో ఆయన రెండో సినిమా యానిమల్ సినిమా కోసం మూవీ లవర్సే కాదండోయ్.. సినీ ఇండస్ట్రీ వర్గాల సైతం ఆసక్తిగా ఎదరుచూస్తున్నాయి.
ఇప్పుడు సందీప్ వంగా ముందు రెండు గోల్స్ ఉన్నాయి. అందులో ఒకటి తన తొలి చిత్రం అర్జున్ రెడ్డిని మించిన హిట్ కొట్టటం ఒకటైతే మరొకటి యానిమల్‌తో తన రికార్డ్ కలెక్షన్స్‌ను తాను దాటాల్సిన పరిస్థితి. ఏమాత్రం తేడా కొట్టినా విమర్శించటానికి అందరూ రెడీ అయిపోతారనటంలో సందేహం లేదు. ఆ విషయం సందీప్‌కి కూడా చక్కగా తెలుసు. అందుకనే తన ఫార్ములాలోనే యానిమల్ సినిమాను రెడీ చేస్తున్నారు. రణ్‌భీర్‌ను ఇప్పటి వరకు ఎవరూ చూపించని ఓ లుక్‌లో చూపిస్తున్నారు సందీప్. గడ్డం, చేతిలో రక్తం తడిసిన గొడ్డలి.. ఇవన్నీ యానిమల్ ఫస్ట్ లుక్‌లో చూసి బాలీవుడ్ వర్గాలైతే షాకయ్యాయి. అసలు ఎవరూ రణ్‌భీర్‌ను ఊహించని రీతిలో సందీప్ ప్రొజెక్ట్ చేస్తున్నారని క్లియర్‌కట్‌గా అర్థమైంది. మరి ఈ ఏడాది ఆగస్ట్ 11న సినిమా విడుదలైతే కానీ.. సందీప్ వంగా ప్రశ్నలకు సమాధానం దొరకదు. అప్పటి వరకు వెయిట్ అండ్ సీ.
