English | Telugu
77 లక్షల రూపాయలకి మోసం.. అలియాభట్ సంతకాన్నిఫోర్జరీ చేసింది ఈమెనే
Updated : Jul 9, 2025
బాలీవుడ్ చిత్ర రంగంలో ప్రముఖ హీరోయిన్ 'అలియాభట్'(Alia Bhatt)కి ఉన్న స్థానం ఎంతో ప్రత్యేకమైనది. లెజండ్రీ డైరెక్టర్ 'మహేష్ భట్'(Mahesh Bhatt)వారసురాలిగా సినీ రంగ ప్రవేశం చేసిన అలియా, పలు సినిమాల్లో వివిధ రకాల పాత్రల్ని పోషిస్తు తన ప్రత్యేకతని చాటుకుంటూ వస్తుంది. నేషనల్ అవార్డుని సైతం అందుకుని సత్తా చాటిన అలియా దగ్గర 2021 నుంచి 2024 వరకు 'వేదిక ప్రకాష్ శెట్టి' అనే మహిళ వ్యకిగత సహాయకురాలిగా పనిచేస్తు వస్తుంది. దీంతో అలియాకి సంబంధించిన సినిమా డేట్స్ ,ఆర్థిక వ్యవహారాలతో పాటు, అలియా సొంత నిర్మాణ సంస్థ ఎటర్నల్ సన్ షైన్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కి సంబంధించిన వ్యవహారాలన్నింటిని వేదిక చూసుకుంటూ ఉండేది.
ఈ క్రమంలో ఉద్యోగంలో చేరిన ఏడాది తర్వాత నుంచే వేదిక నకిలీ బిల్లులు సృష్టించి, వాటిపై అలియా సంతకాన్ని మార్ఫింగ్ చేసి పలు దఫాలుగా సుమారు 77 లక్షల రూపాయిల వరకు మోసం చేసింది. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన అలియా తల్లి ప్రముఖ బ్రిటిష్ నటి, దర్శకురాలైన 'సోని రజ్దాన్'(Sony Razdan)పోలీసులకి ఫిర్యాదు చేయడంతో వేదికపై కేసు నమోదు చేయడం జరిగింది. దీంతో వేదిక ముంబై నుంచి పరారయ్యి అనేక ప్రాంతాల్లో తలదాచుకుంది. చివరకి పోలీసులు బెంగుళూరులో వేదిక ని పట్టుకొని ముంబైకి తీసుకొచ్చారు.
అలియా నుంచి దోచుకున్న మొత్తాన్ని వేదిక తన స్నేహితుల అకౌంట్స్ కి పంపి ఆ తర్వాత వినియోగించేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఎస్ ఎస్ రాజమౌళి(Ss Rajamouli),ఎన్టీఆర్(Ntr) రామ్ చరణ్(Ram Charan)ల ఆర్ఆర్ఆర్(rrr)తో అలియా తెలుగు ప్రేక్షకుల అభిమాన కథానాయికగా మారిన విషయం తెలిసిందే.