English | Telugu

‘దేవర’లో ఎస్తేర్ ఐటమ్ సాంగ్.. ఇదిగో క్లారిటీ!

‘దేవర’లో ఎస్తేర్ ఐటమ్ సాంగ్.. ఇదిగో క్లారిటీ!

2012లో కొన్ని హిందీ సినిమాలు చేసిన ఎస్తేర్‌ 2013లో తేజ దర్శకత్వంలో వచ్చిన 1000 అబద్ధాలు చిత్రం ద్వారా హీరోయిన్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత హిందీతోపాటు తెలుగు, తమిళ్‌, కన్నడ, తుళు, కొంకణి, మరాఠి చిత్రాలు చేస్తూ నటిగా బిజీ అయ్యారు. 2022లో జీ5లో వచ్చిన వెబ్‌ సిరీస్‌ రెక్వీ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అందులో ఎస్తేర్‌ పెర్‌ఫార్మెన్స్‌ చూసిన నందమూరి కళ్యాణ్‌రామ్‌ తను హీరోగా నటించిన డెవిల్‌లో అవకాశం ఇచ్చారు. ఈ సినిమా కూడా ఆమెకు మంచి పేరు తెచ్చింది. ఇప్పుడు ఎస్తేర్‌కి సంబంధించిన ఓ న్యూస్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘దేవర’ చిత్రంలో ఓ ఇంపార్టెంట్‌ క్యారెక్టర్‌ చేస్తోందని కొందరు, ఐటమ్‌ సాంగ్‌ చేయబోతోందని కొందరు న్యూస్‌ను స్ప్రెడ్‌ చేస్తున్నారు. 

ఇటీవల ఓ యూ ట్యూబ్‌ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చింది ఎస్తేర్‌. ‘దేవర’లో క్యారెక్టర్‌ చేస్తున్నానంటూ వచ్చిన న్యూస్‌ గురించి ప్రస్తావించినపుడు.. దానిపై ఎస్తేర్‌ క్లారిటీ ఇస్తూ ‘ఇది నేను కూడా విన్నాను. నన్ను కూడా చాలా మంది అడిగారు. కళ్యాణ్‌రామ్‌గారితో డెవిల్‌ సినిమాలో చేశాను కాబట్టి ‘దేవర’లో కూడా అవకాశం ఇచ్చి ఉంటారు అనేది వారి అభిప్రాయం కావచ్చు. కానీ, అలాంటి ఆఫర్‌ ఏదీ నాకు రాలేదు. కానీ, ఆ సినిమాలో నేను ఉన్నాను అని అందరూ అనుకోవడమే నాకు చాలా హ్యాపీ. కొంతమందికి సినిమాలో క్యారెక్టర్‌ చేస్తే పేరొస్తుంది. కానీ, నేను చేయకపోయినా నాకు పేరు వచ్చింది. ఈ న్యూస్‌ ఇలా రావడానికి కారణం.. ఆ సినిమాలో నేను చేస్తే బాగుంటుందని అందరూ కోరుకోవడమే. దానికి మీడియా కూడా సపోర్ట్‌ చెయ్యడం చూస్తుంటే నేను నిజంగా ఆ సినిమాలో ఉన్నట్టే ఫీల్‌ అవుతున్నాను’ అన్నారు.