English | Telugu
ఆరు కోట్ల భారీ విరాళం ప్రకటించిన పవన్ కళ్యాణ్!
Updated : Sep 4, 2024
ప్రజలు కష్టాల్లో ఉన్నారని తెలిస్తే సాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారు జనసేనాని, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). మరోసారి ఆయన తన గొప్ప మనసుని చాటుకున్నారు. తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాలు వరద ముంపు బారిన పడ్డాయి. ఈ నేపథ్యంలో వరద బాధితులను ఆదుకోవడం కోసం ఏకంగా ఆరు కోట్ల రూపాయలు విరాళం ప్రకటించారు పవన్ కళ్యాణ్.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి విరాళం ప్రకటించారు పవన్. అలాగే, ముంపు గ్రామ పంచాయతీలకు మరో రూ.4 కోట్లు పంపించనున్నట్లు తెలిపారు. వరద ముంపు బారిన పడ్డ 400 గ్రామ పంచాయతీలకు.. ఒక్కో పంచాయతీకి రూ. లక్ష చొప్పున నేరుగా పంచాయతీ ఖాతాకు విరాళం పంపిస్తానని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ కి మొత్తం ఐదు కోట్లు అందించనున్న పవన్ కళ్యాణ్.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి కూడా రూ. కోటి విరాళం ప్రకటించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని స్వయంగా కలిసి ఈ విరాళం అందిస్తానని పవన్ తెలిపారు.
ఈ కష్ట సమయంలో విపక్ష పార్టీ నేతలు అనవసరమైన రాజకీయ విమర్శలు మాని, చేతనైతే సాయం చేయడానికి ముందుకు రావాలని పవన్ అన్నారు.