English | Telugu

చెబుతున్నదొక్కటి...చేస్తున్నదొక్కటి... రాజుగారి తీరుపై అనుమానాలు...

రఘురామకృష్ణంరాజు... ప్రస్తుతం నరసాపురం వైసీపీ ఎంపీ... 2014 ఎన్నికల ముందువరకు వైసీపీలో ఉన్న రఘురామకృష్ణంరాజు... సరిగ్గా ఎలక్షన్స్ ముందు జగన్ తో విభేదించి బయటికి వచ్చేశారు. అంతేకాదు, ఆనాడు ఎవరూ చేయనివిధంగా జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ కు పెద్దలంటే లెక్క లేదని, అసలు ఎవరినీ గౌరవించరని, అటిట్యూడ్ ప్రోబ్లామ్ ఉందని, తనను అవమానించారంటూ లెక్కలేనని విమర్శలు చేశారు. ఆ తర్వాత బీజేపీలోకి... నెక్ట్స్ టీడీపీలోకి వెళ్లారు. మళ్లీ తిరిగి 2019 ఎన్నికలకు ముందు జగన్ ను కలిసి వైసీపీ కండువా కప్పుకున్నారు. అలా, ఐదేళ్ల గ్యాప్ తర్వాత వైసీపీలో చేరి, నరసాపురం ఎంపీ టికెట్ దక్కించుకుని గెలిచారు.

అయితే, గెలిచిన నాటి నుంచీ రఘురామకృష్ణంరాజు వైఖరి కొంచెం తేడాగానే ఉందనే మాట వినిపిస్తూ వస్తోంది. సాధారణంగా ఏ ప్రాంతీయ పార్టీలోనైనా అధినేత మాటే ఫైనల్. జాతీయ పార్టీలతో పోల్చితే స్వేచ్ఛ చాలా తక్కువగా ఉంటుంది. కంట్రోల్డ్ గా వ్యవహరించాల్సి ఉంటుంది. హద్దుల్లో మాట్లాడాల్సి ఉంటుంది. కానీ రఘురామకృష్ణంరాజు అలా కాదు, తనకు నచ్చిందే చేస్తారు, మనసుకు అనిపించే మాట్లాడతారు. తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా చెబుతారు. అయితే, అదే ఇఫ్పుడు రాజు గారికి చిక్కులు తెచ్చిపెడుతోంది. ఇఫ్పటికే ఇంగ్లీష్ మీడియం వివాదంలో ... అలాగే పార్టీ అనుమతి లేకుండా ప్రధాని మోడీని కలిశారంటూ ... అధినేత ఆగ్రహానికి గురైన రఘురామకృష్ణంరాజు... జగన్ ను కలిసి వివరణ ఇచ్చుకున్నారు. అయితే, ఇప్పుడు మరో వివాదంలో రఘురామరాజు చిక్కుకునే అవకాశం కనిపిస్తోంది.

ఒకపక్క పార్లమెంట్ సమావేశాలు జరుగుతుంటే, మరోపక్క రఘురామకృష్ణంరాజు... బీజేపీ పార్లమెంటరీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఎవరిని కలిశారో ఏం మాట్లాడారో తెలియదు గానీ, దాదాపు గంటకు పైగానే అక్కడ గడిపారు. పార్టీ అనుమతి లేకుండా... విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డికి చెప్పకుండా... ప్రధానిని గానీ, కేంద్ర మంత్రులను కానీ కలవొద్దని జగన్ ఆదేశించినా... ఇలా బీజేపీ పార్లమెంటరీ కార్యాలయానికి వెళ్లడం వైసీపీలో మరోసారి కలకలం రేపింది. అయితే, రఘురామకృష్ణంరాజుకి బీజేపీతో సత్సంబంధాలు ఉండటంతో పార్టీ మారొచ్చనే ప్రచారం ఎప్పట్నుంచో జరుగుతోంది. అలాంటిదేమీ లేదని రాజుగారు చెబుతున్నా... ఆయన వ్యవహార శైలి మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. అయితే, జగన్ ను కలిసి వివరణ ఇచ్చుకున్న తర్వాత రోజే, బీజేపీ పార్లమెంటరీ కార్యాలయానికి వెళ్లడంపై మాత్రం వైసీపీ వర్గాలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నాయి.