English | Telugu

పొరుగు రాష్ట్రాలకు విద్యుత్ అమ్మకాలకు ఏపీ సర్కారు గ్రీన్ సిగ్నల్

ఏపీలో విద్యుత్ రంగాన్ని నష్టాల నుంచి గట్టెక్కించేందుకు వైసీపీ సర్కారు ఇవాళ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. విద్యుత్ రంగంపై జరిగిన సమీక్షలో సీఎం జగన్ ఎనర్జీ ఎక్స్‌పోర్ట్‌ పాలసీ తయారీకి ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో విద్యుత్‌ ఉత్పత్తి, ఆ విద్యుత్‌ను బయట అమ్మకోవాలనుకునే కంపెనీలకు, సంస్థలకు అనుకూలంగా పాలసీ రూపకల్పన చేయాలని అధికారులకు సూచించారు. విద్యుత్‌ రంగంలో పెట్టుబడులు, మరిన్ని ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కొత్త విధానం ఉండాలని జగన్ ఆదేశించారు. ఏపీలో కొత్తగా ప్లాంట్లు పెట్టాలనుకునేవారికి సానుకూల వాతావరణం కల్పించేలా విద్యుత్ ఎగుమతుల విధానం ఉండాలని సీఎం సూచించారు.

ఏపీలో కొత్తగా విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం కోసం లీజు ప్రాతిపదికన భూములు తీసుకునే ప్రతిపాదనపైనా జగన్ విద్యుత్ రంగ సమీక్షా సమావేశంలో చర్చించారు. దీనివల్ల భూములిచ్చేవారికి మేలు జరుగుతుందని సీఎం తెలిపారు. దీనివల్ల ప్రతిఏటా రైతులకు ఆదాయం వస్తుందని, భూమిపై హక్కులు ఎప్పటికీ వారికే ఉంటాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో మరో వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ ఉత్పాదనకు ఎన్టీపీసీ ముందుకు వస్తుందని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. వీరికి అవసరమైన భూమిని ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాని వారు సీఎంకు తెలిపారు. రాష్ట్రంలో పది వేల మెగావాట్ల సౌరవిద్యుత్ ప్లాంట్ నిర్మాణంపైనా చర్చ జరిగింది. వీలైనంత త్వరగా ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను కోరారు. సోలార్‌ ప్లాంట్‌ నిర్మాణం విధివిధానాలపైనా సమావేశంలో చర్చించారు. వ్యవసాయానికి 9 గంటలపాటు నిరంతర విద్యుత్‌కోసం ఫీడర్ల ఆటోమేషన్‌ ఏర్పాటు పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. వచ్చే రెండేళ్లలోగా ఆటోమేషన్‌ ప్రక్రియ పూర్తిచేయాలని జగన్ అధికారులను ఆదేశించారు.