English | Telugu

19 లక్షల కుటుంబాలకు రేషన్ కట్ చేసిన జగన్ ప్రభుత్వం!!

ఏపీలో రేషన్ కార్డుల వడపోత పూర్తయ్యింది. కొత్తగా ఇవ్వబోతున్న బియ్యం కార్డులకు అర్హుల ఎంపిక కొలిక్కి వచ్చింది. ఒకటి రెండు కాదు ప్రస్తుతం తెల్లకార్డులు ఉన్న వారిలో ఏకంగా 18 లక్షల 72 వేల కుటుంబాలను అనర్హులుగా ప్రభుత్వం తేల్చింది. ఒక్కో కుటుంబానికి సగటున ముగ్గురు సభ్యుల చొప్పున చూసినా సుమారు 55 లక్షల మందికి నెలనెలా బియ్యం ఇతర సరుకుల పంపిణీ నిలిచిపోనుంది. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా బియ్యం రూపంలోనే రూ.1449 కోట్లు ఆదా కానుంది. పంచదార, గోధుమలు, పామోలిన్, చిరుధాన్యాలు లాంటి ఇతర నిత్యావసరాలు కలిపితే ఈ మొత్తం ఇంకా పెరుగుతుంది.

అత్యధికంగా గుంటూరు జిల్లాలో 2,26,000 , కృష్ణాలో 2,11,000 , తూర్పు గోదావరి జిల్లాలో 1,94,000 కుటుంబాలకు అర్హత లేదని తేల్చారు. రాష్ట్రంలో గుర్తించిన అనర్హుల్లో మూడోవ వంతు ఈ మూడు జిల్లాల నుంచే ఉన్నారు. తర్వాత స్థానాల్లో అనంతపురం 1,62,000 , చిత్తూరు 1,55,000 , నెల్లూరు 1,49,000 , విశాఖపట్నం 1,34,000 , ప్రకాశం, కర్నూలు 1,31,000 , పశ్చిమ గోదావరి 1,25,000 , కడప 1,12,000 , శ్రీకాకుళం 74,000 , విజయనగరం జిల్లాలో 64,000 కుటుంబాల చొప్పున ఉన్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుల స్థానంలో కొత్తగా బియ్యం కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ఆరోగ్య శ్రీ, ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకాలకు అర్హులను వేరువేరుగా గుర్తిస్తుంది. ఇందుకోసమే వైఎస్సార్ నవోదయ పథకాన్ని ప్రారంభించింది. ఇంటింటి సర్వే చేయించింది. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల వివరాలు వాలెంటీర్ లకు ఇచ్చి జాబితాలు తయారు చేయించింది. ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, నెలకు 200 యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగించే వారు, నాలుగు చక్రాల వాహనాలు ఉన్న వారు, 750 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఇళ్లున్న వారిని అనర్హులుగా తేల్చింది. వాటి ఆధారంగా జనవరి రెండు వరకు అభ్యంతరాలు స్వీకరించి తుది జాబితా రూపొందించింది. కార్డుదారులు అందరి వివరాలను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ సచివాలయాలు క్లస్టర్ ల వారీగా మ్యాపింగ్ చేస్తున్నారు. వారందరికీ ఈ నెల 15 నుంచి కొత్త బియ్యం కార్డులు ఇచ్చి మార్చి నుంచి రేషన్ పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇంకా అర్హులుంటే దరఖాస్తులు తీసుకుని ప్రతినెలా కొత్త కార్డులు జారీ చేస్తామని అధికారులు చెబుతున్నారు.