English | Telugu

వైసీపీ రాజ్యసభ అభ్యర్ధుల ఖరారు..! టీఆర్ఎస్ లో కొనసాగుతోన్న సస్పెన్స్...

వైసీపీ రాజ్యసభ అభ్యర్ధులు దాదాపు ఖరారు అయ్యారు. మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్... అలాగే, రాంకీ సంస్థల ఛైర్మన్ అయోధ్య రామిరెడ్డిని రాజ్యసభకు పంపాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. నాలుగో సీటును పారిశ్రామికవేత్త పరిమల్ నత్వానికి కేటాయించనున్నారు. శాసనమండలి రద్దు కానున్న నేపథ్యంలో... మంత్రి పదవులు కోల్పోనున్న మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లను రాజ్యసభకు పంపుతున్నారు. త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.

ఏపీలో రాజ్యసభ అభ్యర్ధులను ఖరారైనా, తెలంగాణలో మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. టీఆర్ఎస్ కు దక్కనున్న రెండు రాజ్యసభ స్థానాల్లో ఎవరిని పంపుతారనేది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. టీఆర్ఎస్ లో ఆశావహులు ఎక్కువగా ఉండటంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సస్పెన్స్ కంటిన్యూ చేస్తున్నారు. ముఖ్యంగా కేకే, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కేసీఆర్ కుమార్తె కవిత, అలాగే, కేసీఆర్ సన్నిహితుడు దామోదర్ రావు, హెటెరో అధినేత పార్ధసారధి రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ఐదుగురిలోనే ఇద్దరి ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది.

రాజ్యసభ ఎన్నికల్లో ఈనెల 13న నామినేషన్ వేయాల్సి ఉండటంతో మరో మూడ్రోజుల్లోపే అభ్యర్ధులను ప్రకటించాల్సి ఉంటుంది. దాంతో, రాజ్యసభ అభ్యర్ధుల ఎంపికపై ముఖ్యమంత్రి కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. అయితే, ఈనెల 12న పెద్దల సభకు వెళ్లే అభ్యర్ధులను ప్రకటించనున్నారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.