English | Telugu

అయోమయం, గందరగోళం అమరావతిలోని ఉద్యోగుల పరిస్థితి..

మనకి కోపం వచ్చినా, వారికి కోపం వచ్చినా మనకే నష్టం అన్నట్టుంది ఆంధ్రప్రదేశ్ (రాజధాని) అమరావతిలోని కిందస్థాయి ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఉంది. ఒక్క శాఖ కాదు అన్ని శాఖల ఉద్యోగులకూ ఇదే స్థితి. వచ్చే ఫస్టుకు ఇల్లు ఖాళీ చేయాలి అని అద్దె ఇంటి ఓనరు మౌఖికంగా చెప్పినట్లుగా శాఖాధిపతులు ఉద్యోగులకు చెబుతున్నారు. ఏమని? వచ్చే నెలా 5 కల్లా విశాఖపట్నం వెళ్లిపోవాలి. లేకపోతే ఇదే మీకు ఆఖరి జీతం.

ఈ మాటలు విన్న ఉద్యోగులకు ఒక్కసారిగా బీపీ తగ్గిపోయి ముచ్చెమటలు పడుతున్నాయి. ఏం చేయాలో తోచడం లేదు. కార్యాలయాల మార్పు గురించి లిఖిత పూర్వక ఆజ్ఞలు ఏమైనా జారీ చేస్తున్నారా అంటే అదీ లేదు. అమరావతి నుంచి వెళ్లి పోవాలి, విశాఖ తరలి పోవాలి. అంతే.. అక్కడ ఆఫీసు ఎక్కడ? ఎక్కడ కూర్చోవాలి? తమకు వసతి సదుపాయాల మాట ఏంటి? ఎవరు చూస్తారు?

ఇవన్నీ ఎన్నటికి సమాధానం దొరుకుతాయో తెలియని ప్రశ్నలే. వీటికి సమాధానం ఉండదు. పై అధికారులు మాత్రం సిబ్బంది కనిపించినప్పుడల్లా వచ్చే నెల 5 వరకే నీకు ఉద్యోగం. 6వ తేదీ నుంచి విశాఖ పట్నం రాకపోతే నీకు ఇదే ఆఖరు జీతం అని చెబుతున్నారు. కొంతమందైతే ఉద్యోగం మానేస్తే మానెయ్యి అని కూడా అంటున్నారు. మా వాళ్లు చాలా మంది ఉన్నారు అని కూడా కొందరు అధికారులు చెబుతున్నారు. ఈ మాటలు సరదాకి అంటున్నారో, నిజంగానే అంటున్నారో తెలియక తలలు బాదుకుంటున్నారు. ఈ మాటలతో అమరావతి ప్రాంతంలో ఉద్యోగాలు చేసేవారికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. విశాఖపట్నం ఎలా వెళ్లాలి? వెళ్లి అక్కడ ఎలా ఉండాలి? కొందరు ఉద్యోగులు ఈ తికమకతో కుడితిలో పడ్డ ఎలుకల్లా కొట్టుమిట్టాడుతున్నారు.

గతంలో హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చే సమయంలోలా అనునయించి చెప్పే పరిస్థితి లేకపోవడం ఉద్యోగులకు మరింత కలవరం కలిగిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులం, అదీనూ సచివాలయ ఉద్యోగులం అనే తేడా లేకుండా అడ్డా మీద రోజు వారీ కూలీలను చూసినట్లు తమను చూడటం వారిని మరింత బాధేస్తున్నది. తమను బదిలీ చేస్తున్నట్లు ఆర్డర్ ఇస్తే బాగుంటుందని వారు కోరుకుంటున్నారు. కానీ వారి మొర ఆలకించే దిక్కే లేకుండా పోయింది. వెళ్లి పోవాల్సిందే.. అంతే అంటున్నారు. ఉగాది పంచాంగ శ్రవణంలో పండితులైనా తమ భవిష్యత్తు ఏమిటో చెప్పగలరో, లేదో అనుకుంటున్నారు.