English | Telugu

ఎన్నేళ్లకెన్నేళ్లకు.. కోర్టు మెట్లెక్కనున్న జగన్

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కోర్టు మెట్లు ఎక్కక తప్పదా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. అక్రమ ఆస్తుల కేసులలో నిండా కొరుకుపోయి.. ఒకప్పుడు 16 నెలల పాటు జైలు జీవితం గడిపిన జగన్ ప్రస్తుతం బెయిల్ పై ఉన్న విషయం తెలిసిందే. 2019 ఎన్నికలకు ముందు కోర్టుకు హాజరైన ఆయన.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ హాజరు నుంచి మిన‌హాయింపు పొందుతూ వచ్చారు. అలా మినహాయింపు పొందడానికి ఆయన చెబుతూ వచ్చిన కారణం పాలనాపరమైన బాధ్యతలు.

అయితే 2024 ఎన్నికలలో ఆయన పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఆయన ప్రస్తుతం ముఖ్యమంత్రి కూడా కాదు. అయినా ఇప్పటి వరకూ ఆయన విచారణకు వ్యక్తిగతంగా హాజరైంది లేదు. అయితే ఇకపై ఆ పరిస్థితి ఉండే అవకాశం లేదంటున్నారు సీబీఐ అధికారులు.ఇక ఆయన హైదరాబాద్ లోని సీబీఐ కోర్టు ముందు వచ్చే నెల 14న హాజరు కాకతప్పదు. అంటే ఏడేళ్ల తరువాత తొలి సారిగా నవంబర్ 14 జగన్ నాంపల్లి కోర్టు మెట్లెక్కనున్నారు. జగన్ అక్రమాస్తుల కేసు విచారిస్తున్నసీబీఐ కోర్టు ఎదుట ఆయన హాజరు కానున్నారు. ఇటీవల జగన్ సకుటుంబ సమేతంగా లండన్ పర్యటించారు.

ఆ సమయంలో లండన్ పర్యటనకు కోర్టు అనుమతస్తూ విధించిన షరతును జగన్ ఉల్లంఘించారు. కోర్టు ఆదేశాల మేరకు జగన్ తన కాంటాక్ట్ ఫోన్ నంబర్ ఇవ్వాల్సి ఉండగా జగన్ అందుకు భిన్నంగా వేరే ఫోన్ నంబర్ ఇచ్చారు. ఈ విషయాన్ని సీబీఐ కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. అయితే దానిపై కోర్టు నిర్ణయం తీసుకునేలోగానే జగన్ లండన్ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చేశారు. అయితే ఇటీవలి విచారణలో కోర్టు ఆయనను తదుపరి విచారణకు తప్పని సరిగా వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. ఆ ఆదేశాల మేరకు నవంరబ్ 14న జరిగే విచారణకు జగన్ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరై తీరాలి.