English | Telugu

రెచ్చిపోయిన వైసీపీ నేత.. 6 నెలలుగా కరెంటు బిల్లు కట్టకపోగా.. లైన్‌మ్యాన్‌పై దాడి!

ఆరునెలలుగా కరెంటు బిల్లు కట్టలేదు.. బిల్లు కట్టమన్న అధికారులను అధికార పార్టీ అంటూ బెదిరించాడు.. ఆరు నెలలు ఓపిక పట్టిన అధికారులు.. ఇక చేసేది లేక కరెంట్ ఫ్యూజ్ తొలగించారు. ఇంకేం సదరు అధికార పార్టీ నేత రెచ్చిపోయాడు. లైన్ మైన్ తన ఇంటికి పిలిపించి దాడి చేశాడు. తీవ్రంగా కొట్టాడు.. అంతేకాదు లైన్ మెన్ కేసు పెట్టినా తీసుకోవద్దంటూ పోలీసులకు కూడా హుకుం జారీ చేశాడు.. దీంతో పోలీసులు లైన్ మెన్ పై జరిగిన దాడి లైట్ తీసుకున్నారు... ఇదీ జరిగింది రౌడీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచో బీహార్ లో కాదు.. అరాచకాల్లో బీహార్ ను దాటేస్తున్న.. జగన్ రెడ్డి పాలనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో..

గుంటూరు శివారులోని నల్లపాడుకు చెందిన వైసీపీ నేత గాదె నాగిరెడ్డి ఆరు నెలలుగా తన ఇంటి కరెంటు బిల్లు కట్టడంలేదు. ఎవరైనా అడిగితే అధికార పార్టీ పేరు చెప్పి బెదిరిస్తున్నారట. ఈ నేపథ్యంలో ఈ నెల 24న ఆ ఏరియా లైన్‌మ్యాన్‌ పట్నాయక్‌.. నాగిరెడ్డి ఇంటికి వెళ్లి ఆరు నెలలుగా బిల్లు కట్టనందున ‘డీ-లిస్టు’లో పేరు వచ్చిందంటూ ఫ్యూజు తొలగించారు. ఆ సమయంలో నాగిరెడ్డి ఇంట్లో లేరు. ఆ తర్వాత కాసేపటికి పట్నాయక్‌ కు ఫోన్ చేసిన నాగిరెడ్డి.. 'బిల్లు చెల్లించాం. వస్తే రశీదు చూపిస్తాం. ఫ్యూజు మళ్లీ పెట్టి వెళ్లు' అంటూ నమ్మబలికారు. దీంతో పట్నాయక్‌ తోటి సిబ్బందితో కలిసి నాగిరెడ్డి ఇంటికి వెళ్లారు. అయితే, పట్నాయక్‌ వచ్చీ రాగానే ‘నా ఇంటికే కరెంట్‌ కనెక్షన్‌ పీకేస్తావా.. ఎంత ధైర్యంరా’ అంటూ నాగిరెడ్డి మరో వ్యక్తితో కలిసి ఆయనపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. దాడిని అడ్డుకునేందుకు తోటి సిబ్బంది ప్రయత్నించినా వారు ఆగలేదు. దాడిలో తీవ్రంగా గాయపడి స్పృహ తప్పి పడిపోయిన పట్నాయక్‌ ను తోటి సిబ్బంది ఆసుపత్రికి తరలించారు.

తమ లైన్‌మ్యాన్‌ పై దాడి జరిగిందని ఏఈ కిరణ్‌ కుమార్‌ అదేరోజు ఫిర్యాదు చేసినా.. పోలీసులు దానిని స్వీకరించలేదు. అంతేకాదు, కొందరు వైసీపీ నేతలు ఏఈకి ఫోన్‌ చేసి‌ కేసు పెడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని బెదిరించినట్లు సమాచారం. చివరికి విద్యుత్‌ అధికారులు, యూనియన్‌ ఒత్తిడితో ఈ నెల 26న ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అయితే, ఇంత జరిగినా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడం గమనార్హం. కాగా, సోమవారం డి-లిస్టులో ఉన్న బకాయిదారుల విద్యుత్‌ కనెక్షన్లను తొలగించే కార్యక్రమాన్ని ఆ ప్రాంతంలోని విద్యుత్‌ సిబ్బంది బహిష్కరించి, నిరసన వ్యక్తం చేయడంతో ఈ దాడి విషయం వెలుగులోకి వచ్చింది. పట్నాయక్‌ పై దాడి చేసిన నిందితుడిని అరెస్ట్‌ చేస్తేనే తాము విధులకు హాజరవుతామని విద్యుత్‌ సిబ్బంది తేల్చిచెప్పారు. నాగిరెడ్డిపై కేసు నమోదు చేసినప్పటికీ ఇప్పటిదాకా అరెస్టు చేయకపోవడం గమనార్హం. కొందరు నేతల ఒత్తిళ్ల కారణంగానే అరెస్ట్ చేయలేదని తెలుస్తోంది.