English | Telugu

కర్ణాటక శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఆత్మహత్య.. కారణం అదేనా..! 

కర్ణాటక శాసనమండలి డిప్యూటీ చైర్మన్, జేడీఎస్ ఎమ్మెల్సీ ధర్మెగౌడ నిన్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. నిన్న సాయంత్రం ధర్మెగౌడ తన ఇంటి నుంచి బయటకు వెళ్లారు. అయితే తాను ఎక్కడికి వెళ్తున్నదీ ఎవరికీ చెప్పలేదు. అలా వెళ్లిన ఆయన మళ్ళీ తిరిగి రాకపోవడంతో.. ఎమ్మెల్సీ గన్​మెన్, పోలీసులు ఆయన కోసం గాలించారు. అయినా ఎక్కడా అయన జాడ కనిపించలేదు.

అయితే ఈ తెల్లవారుజామున రెండు గంటల సమయంలో చిక్కమగళూరు జిల్లా కదుర్ తాలూకా గుణసాగర్ సమీపంలోని రైల్వే ట్రాక్ పక్కన ఆయన మృతదేహాన్ని గుర్తించారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఆయన రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహం పక్కనే ఉన్న సూయిసైడ్ లెటర్ ‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆత్మహత్య ఘటన కర్ణాటక వ్యాప్తంగా కలకలం రేపింది. ధర్మెగౌడ ఆత్మహత్య విషయం తెలిసి మాజీ ప్రధాని దేవెగౌడ, జేడీఎస్ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే ఆయన ఆత్మహత్యకు గల కారణం తెలియరాలేదు.

ఈ నెల 16న శాసనమండలిలో శాసనమండలి చైర్మన్ కె ప్రతాపచంద్ర శెట్టిపై ప్రతిపక్షం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా తీవ్ర స్థాయిలో రభస జరిగింది. అప్పుడు సభాపతి స్థానంలో ఉన్న ధర్మెగౌడను కాంగ్రెస్ సభ్యులు చైర్మన్ సీటు నుంచి లాక్కెళ్లడం అప్పట్లో దేశవ్యాప్తంగా వివాదాస్పదమైంది. ఆ ఘటనతో ఆయన తీవ్ర మనస్థాపం చెంది ఉంటారని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ధర్మెగౌడ ఆత్మహత్య చేసుకోవడం తాజాగా కర్ణాటకలో తీవ్ర కలకలం రేపుతోంది.