English | Telugu
నాటక రంగానికి జీవం పోయాలి!
Updated : Mar 27, 2020
ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన మహిళా దినోత్సవం, బాలల దినోత్సవం, క్షయ వ్యాధి నివారణ దినోత్సవం, పర్యావరణ దినోత్సవం, వాలెంటైన్స్ డే, లాంటి వివిధ అంశాల మీద ఒక ప్రత్యేక దినాన్ని ఏర్పరచుకొని ఆ రోజు ఆ విషయం మీద విస్తృత చర్చ, పత్ర సమర్పణ చేస్తుంటారు. సరిగ్గా అలాంటి ఒకటి రంగస్థలానికి కూడా అంతర్జాతీయంగా ‘ప్రపంచ థియేటర్ డే'గా ఏర్పరచాలని జాతీయ స్థాయి థియేటర్ ఇన్‌స్టిట్యూట్ వారు 1961 మార్చి 27 నాడు నిర్ణయించారు.
1961 మార్చి 27 నాడు ప్రారంభించిన అంతర్జాతీయ రంగస్థల దినోత్సవానికి మొట్టమొదట ప్రారంభ వ్యాసాన్ని జీన్ కోకటియ్ ప్యారిస్‌లో 1962లో సమర్పించారు. అప్పటి నుండి ప్రపంచ వ్యాప్తంగా కళా రంగాల్లో నిష్ణాతులు ఒకరు మార్చి 27 నాడు నాటకరంగంలో అన్నింటిని సోదాహరణగా వివరిస్తూ పత్ర సమర్పణ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఆ రోజు నుండి ప్రతి సంవత్సరం ‘ప్రపంచ రంగస్థల దినోత్సవం'గా గుర్తించి,వివిధ దేశాల రంగస్థల కళాకారులంతా వారి వారి రంగస్థల వేదికలపై మార్చి 27 నాడు ఘనంగా ప్రదర్శనలు, చర్చలు జరుపుకుంటున్నారు. ఏ కళా రూపమైనా ఆలోచనతో మొదలయి సృజనాత్మకతతో ముగియాలి. అప్పుడే ఆ కళ.. దేశ భాషలు, సంస్కృతి సంప్రదాయాలకు అతీతంగా నిలుస్తుంది. అంతర్జాతీయ సమస్యలను ప్రపంచదేశాలకు ఏకీకృతంగా చూపించగలుగుతుంది.
మూస పద్ధతిలో ప్రదర్శిస్తున్న నాటకాల పోకడలకు కొత్త బీజం వేస్తూ రచయితలు సామాజిక సమస్యల్ని రాజకీయ సమస్యలను మహిళల మీద జరుగుతున్న అత్యాచారాల్ని మన హక్కుల కోసం పోరాటం లాంటి స్వరూప స్వభావాలతో, సహజత్వంతో కూడిన సందేశాలతో, సార్వజనీనకంగా ఉన్న రచనలు, రచనల్లో సమగ్రంగా చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి నాటకాలను దర్శించడానికి ప్రయోక్తలు, టెక్నీషియన్స్ ఎన్నో అధ్యయనాలు చేసి సంగీతంలోనూ, లైటింగ్ లోనూ పాత్రల ఫ్రీజింగ్ లాంటివి సాంకేతికంగా చొప్పించి, వాస్తవికంగా చూపించి ప్రదర్శించడానికి కృషి చేస్తున్నారు.
అంతర్జాతీయ రంగస్థల దినోత్సవం (థియేటర్ డే) నాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రంగస్థల నిష్ణాతులు మార్చి 27 నాడు నాటక ప్రియులకు తమ అనుభవాలు, కొత్త ప్రయోగాలు, సిద్ధాంత వ్యాసాలు అందిస్తున్నారు. ఈ సంవత్సరం పాకిస్థాన్ లోని ప్రముఖ నాటక రచయిత షాహిద్ నదీమ్ సందేశాన్ని అందించారు. ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా నాటకం దశ, దిశ గురించి విస్తృతంగా చర్చించుకోవడానికి మార్చి 27 ఎంతో తోడ్పడుతుంది. ఈ ఉత్సవ వైశిష్ట్యాన్ని ముందుతరం కళాకారులకు అందించి ప్రోత్సహించాల్సిన గురుతర బాధ్యత ఈనాటి కళాకారులందరి మీదా ఉన్నది.
- రావుల పుల్లాచారి, నాటక రచయిత , విశ్రాంత పర్యవేక్షకులు, 9949208476