English | Telugu

తెలంగాణలో మహిళను చంపిన కోతులు... ఏపీలో తేనెటీగల దాడితో ఐదుగురికి సీరియస్

అడవిలో ఉండాల్సిన జంతువులు జనారణ్యంలోకి వస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. కొన్ని ఆహారం, నీళ్ల కోసం... జనారణ్యంలోకి వస్తుండగా... మరికొన్ని దారితప్పి గ్రామాల్లోకి వస్తూ అలజడి సృష్టిస్తున్నాయి. చిరుతలు భయపెడుతుంటే... ఏనుగులు వెంటబడుతున్నాయి... కొండ ముచ్చులు వణికిస్తుంటే... తేనెటీగలు తరుముతున్నాయి... ఎలుగుబంట్లు, అడవి పందులైతే జనాన్ని పరుగులు పెట్టిస్తున్నాయి... ఇక, కోతులైతే ఏకంగా ఇళ్లల్లోకి వచ్చి దాడులు చేస్తుండటంతో ప్రజలు ప్రాణభయంతో వణికిపోతున్నారు. ఏపీ, తెలంగాణలో ఒక్కరోజే ఏనుగులు, కోతులు, ఎలుగుబంట్లు, తేనెటీగలు జనంపై దాడి చేసి హడలెత్తించాయి.

చిరుతలు పదేపదే జనారణ్యంలోకి వస్తూ జనాన్ని భయపెడుతున్నాయి. అటవీ ప్రాంతాల్లోనే కాదు... కాంక్రీట్ జంగిలైన హైదరాబాద్‌‌లోకి సైతం ప్రవేశిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇప్పటివరకు చిరుతల దాడిలో ప్రజలకు ఎలాంటి ప్రాణనష్టం జరగపోయినా పొలాల్లోకి, గ్రామాల్లోకి వస్తూ అలజడి సృష్టిస్తున్నాయి. ఇక, హైదరాబాద్ నగర శివార్లలో అటవీ ప్రాంతాలు ఉండటంతో అక్కడ కూడా జనాల్లోకి వస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి.

ఇక, ఏనుగులదీ అదే పరిస్థితి. ఉత్తరాంధ్ర, చిత్తూరు జిల్లాల్లో నిత్యం అలజడి సృష్టిస్తుంటాయి. శ్రీకాకుళం, విజయనగరం, చిత్తూరు జిల్లాల్లో ఇప్పటివరకు ఏనుగుల దాడిలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. పొలాలను ధ్వంసం చేయడమే కాకుండా గ్రామాల్లోకి వస్తూ జనాన్ని పరుగులు పెట్టిస్తున్నాయి. తాజాగా, చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఏనుగుల గుంపు ఒక్కసారిగా పొలాలపై పడటంతో రైతులు భయంతో వణికిపోయారు.

మరోవైపు, అనంతపురం జిల్లా మడకశిరలో జనారణ్యంలోకి ప్రవేశించి... జనాన్ని హడలెత్తించిన ఎలుగుబంటిని అతికష్టంమీద బంధించి తరలించారు. ఇక, కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం చింతకుంట్లలో తేనెటీగలు దాడి చేయడంతో 50మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. అలాగే, ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌లో ఓ ఇంట్లోకి ప్రవేశించిన కోతుల గుంపు మూకుమ్మడిగా దాడి చేయడంతో మహిళ ప్రాణాలు కోల్పోయింది. మొత్తానికి, చిరుతలు, ఏనుగులు, ఎలుగుబంట్లు, కోతులు, అడవి పందులు, కొండముచ్చులు... జనారణ్యంలోకి వస్తూ దాడులు చేస్తుండటంతో ప్రాణభయంతో జనం వణికిపోతున్నారు.