English | Telugu
దక్షిణాఫ్రికా మూడు రాజధానుల కథ-కష్టాలు... ఏపీలోనూ తప్పవు తిప్పలు...
Updated : Dec 18, 2019
ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు రావొచ్చేమోనంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.... అందుకు ఉదాహరణగా దక్షిణాఫ్రికాను ప్రస్తావించారు. అధికార వికేంద్రీకరణలో భాగంగా సౌతాఫ్రికాకు మూడు రాజధానులు ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. అయితే, ఇందులో కొంత వాస్తవం... కొంత అవాస్తవముంది. ఎందుకంటే, దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులు ఉండటం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఆర్ధిక, చారిత్రక, సామాజిక రీజన్స్ కనిపిస్తాయి. సౌతాఫ్రికాలో చట్టసభలు అంటే శాసన విభాగం కేప్ టౌన్ ఉండగా.... న్యాయ వ్యవస్థ మొత్తం బ్లూంఫౌంటేన్ లో ఉంది. ఇక, కార్య నిర్వాహక వ్యవస్థ అదే జగన్ చెప్పిన ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ప్రిటోరియాలో కొలువుదీరింది. దాంతో, దక్షిణాఫ్రికా ప్రభుత్వ కార్యకలాపాలన్నీ ప్రిటోరియా నుంచే కొనసాగుతాయి. అయితే, దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ జాతుల ప్రజల కోరిక మేరకు ఇలా మూడు రాజధానులను కొనసాగిస్తున్నా... ఇందుకు మరెన్నో కారణాలు కూడా ఉన్నాయి.
ప్రస్తుతమున్న దక్షిణాఫ్రికా... ఒకప్పుడు చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేది. ఒక వైపున బ్రిటీషర్లు... మరో వైపున డచ్, జర్మనీలు కలిసి పాలించే వారు. డచ్, జర్మనీల పాలనలో ఉన్న రాజ్యాలను బోయెర్ రిపబ్లిక్ లుగా వ్యవహరించే వారు. అయితే, బ్రిటీషర్లకు ఇతర చిన్న రాజ్యాల మధ్య యుద్ధాలు జరిగాయి. యుద్ధంలో గెలిచిన బ్రిటీష్.... ఓడిపోయిన బోయెర్ రిపబ్లిక్ ల మధ్య చర్చలతో యూనియన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా ఏర్పడింది. అయితే, అప్పుడు బ్రిటీష్ ఆధీనంలో ఉన్న కేప్ ప్రావిన్స్ కు కేప్ టౌన్ రాజధానిగా ఉండేది. బోయెర్ రిపబ్లిక్ ఆఫ్ ట్రాన్స్ వాల్ కు ప్రిటోరియా రాజధానిగా ఉండేది. ఆరెంజ్ ఫ్రీ స్టేట్ అనే మరో బోయెర్ రిపబ్లిక్ కు బ్లూమ్ ఫౌంటెన్ రాజధానిగా ఉండేది. యుద్ధానంతర చర్చల తర్వాత ఈ మూడు నగరాలనూ రాజధానులుగా కొనసాగిస్తూ వచ్చారు.
అయితే, 1994లో దక్షిణాఫ్రికాలో శ్వేతజాతి పాలన ముగిసి ప్రజాస్వామ్యం దిశగా పయనం మొదలైంది. దాంతో, ప్రిటోరియానే అన్నిటికీ రాజధాని చేయాలని కొందరు అంటే.... జాత్యంహంకారానికి ప్రతిబింబంగా ఉండే ప్రిటోరియా బదులుగా కొత్త రాజధాని నిర్మించుకుందామని మరి కొందరు అన్నారు. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ కూడా కొత్త నగరానికే ప్రాధాన్యం ఇచ్చింది. కాకపోతే కొత్త నగరం అంటే ఖర్చు అధికమనే భావనతో ఆ ప్రతిపాదనను వదిలేశారు. మరో వైపున మూడు విభిన్న తెగల వాళ్ళు అప్పటివరకూ రాజధానులుగా కొనసాగిన తమ నగరాలు అదే హోదాలో కొనసాగాలని డిమాండ్ చేశారు. ఒక్కో చోట ఒక్కో పార్టీ అధికారంలో ఉండడంతో మూడు రాజధానుల వాదన కొనసాగింది. ఇదీ దక్షిణాఫ్రికా మూడు రాజధానుల కథ.
దక్షిణాఫ్రికా ఫ్రీడమ్ ఫైటర్, సౌతాఫ్రికా మొదటి నల్లజాతి అధ్యక్షుడు నెల్సన్ మండేలా కూడా, మూడు రాజధానులను వ్యతిరేకించారు. మూడు రాజధానుల నిర్వహణ భారంగా మారడంతో కార్యకలాపాలన్నీ ఒకేచోట నుంచి నిర్వహించేందుకు ప్రయత్నించారు. సింగిల్ కేపిటల్ కోసం ఒక కమిటీని కూడా నియమించారు. 2016లో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన జాకబ్ జుమా కూడా ఒకే రాజధానిని ఏర్పాటు చేసుకుందామంటూ సౌతాఫ్రికా పార్లమెంట్ ను అభ్యర్ధించారు. మూడు రాజధానులతో ప్రభుత్వ వ్యవస్థపై నియంత్రణ సాధ్యంకావడం లేదని, అలాగే నిర్వహణ భారం పెరిగిపోతోందని అన్నారు. చారిత్రక నేపథ్యంతో సాతాఫ్రికాకు మూడు రాజధానులు కొనసాగుతున్నాయే తప్పా.... ప్రజల సౌకర్యం, సౌలభ్యం కోసం మాత్రం కాదనేది తెలుస్తోంది. పైగా మూడు రాజధానుల నిర్వహణ సౌతాఫ్రికాకు భారంగా మారింది. ఇప్పుడు ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే, ప్రజలకు కష్టాలు తప్పవు. ఎందుకంటే, ఉత్తరాంధ్రకు రాయలసీమ దూరం కాగా... రాయలసీమకు ఉత్తరాంధ్ర కూడా బహు దూరమే. అటు ఉత్తరాంధ్రకు... ఇటు రాయలసీమకు మధ్యలో ఉన్న అమరావతే అన్నింటినీ బెటర్ ఆప్షన్.