English | Telugu
ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ ఏమయ్యారు?
Updated : Dec 24, 2019
ఎన్నికల ముందు వరకు టిడిపిలో ఉన్న తిరుపతి ఎంపి బల్లి దుర్గా ప్రసాద్ ఫలితాలు ఊహించి వైసీపీ లోకి జంప్ చేశారు. ఇలా వచ్చారో లేదో అలా సీటు దక్కడం ఇలా భారీ మెజార్టీతో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి పై గెలిచి బంపర్ ఆఫర్ కొట్టేశారు. ఊహించని విధంగా ఎంపికైన దుర్గా ప్రసాద్ నియోజక వర్గ ప్రజలకు కనిపించకుండా పోయారు. ఆయన ఎప్పుడు వస్తున్నారో ఎక్కడ ఉంటున్నారో సొంత పార్టీ నేతలకు కూడా అర్థం కావడం లేదు. నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన ఈయన తిరుపతి ఎంపిగా గెలిచాక కూడా గూడూరుకే పరిమితమయ్యారు. అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెడతారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్వహించే సమావేశాలు, రిబ్బన్ కటింగులలో తప్ప ఎంపీ కనిపించడం లేదు. ఎంపీకి సమస్యలు చెప్పుకుందామనుకునే ప్రజల సంగతి దేవుడెరుగు, కనీసం కార్యకర్తలకు కూడా బల్లి అందుబాటులో లేకుండా పోయారు. ఏదైనా అందామా అంటే పార్టీలోకి కొత్తగా వచ్చిన వ్యక్తి కావడంతో ఎవరు ఏమి చేయలేకపోతున్నారు. పార్టీ హైకమాండ్ కు చెప్పుకుందామంటే అది ఎవరో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు వైసిపి తిరుపతి నియోజక వర్గ కేడర్. కనీసం ఎంపీకి సంబంధించినవారైనా ఉన్నారా అంటే అది లేకుండా పోయింది. ఎంపీని కలవాలంటే ఎవరిని అడగాలో కూడా తెలియని పరిస్థితి వచ్చిందని నగరవాసుల్లోనూ చర్చ నడుస్తోంది. ఇక ఎంపీని కలవాలని నియోజక వర్గ ప్రజలు అడిగితే కుమ్మరోడికి కుండలు కరువ అన్న రీతిలో తమకే దర్శనభాగ్యానికి దిక్కులేదని సొంత పార్టీ కేడర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నేతలు.
నెలకో రెండు నెలలకో ప్రెస్ మీట్ లో తప్ప మరెక్కడా కనిపించని ఎంపి బల్లి దుర్గా ప్రసాద్ తీరు పై తిరుపతి ప్రజలు గుర్రుగా ఉన్నారని సమాచారం. గెలిచాకే కాదు ఎన్నికల ప్రచారంలో కొన్ని ప్రాంతాల వారికి కనీసం మొహం కూడా చూపించలేదు దుర్గా ప్రసాద్. పార్లమెంట్ నియోజక వర్గంలో కీలకమైన తిరుపతి, సత్యవేడు, శ్రీకాళహస్తిలో ఎక్కడ బల్లి ప్రచారం చేసిన దాఖలాలు లేవు. గెలిచాకైనా మారతారు అనుకుంటే బల్లి దుర్గా ప్రసాద్ తీరులో మాత్రం మార్పు రాలేదు. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా రైల్వే స్టేషన్ తనిఖీలు, ఆసుపత్రి తనిఖీ అంటూ హడావుడి చేయడం తప్ప నగర వాసుల సమస్యలు పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఎమ్మెల్యే భూమనతో ఉన్న భేదాభిప్రాయాల కారణం గానే బల్లి తిరుపతి మొహం చూడటం లేదని తెలుస్తోంది. ఏది ఏమైనా ఎన్నికల్లో గెలిచాక తిరుపతి వాసులకు వెంకన్న దర్శనం అయినా దొరుకుతుందేమో గానీ ఎంపీగారి దర్శనం అంతంత మాత్రమే అనే చర్చ జోరుగానే సాగుతోంది. పరిస్థితి ఇలానే ఉంటే నియోజక వర్గం ప్రజల్లో అది తీవ్ర అసంతృప్తికి కారణమవుతుందని అంటున్నారు. ఇక ఆ ఎఫెక్ట్ పార్టీ పై పడుతుందని తిరుపతి వైసీపీలో ప్రచారం జరుగుతోంది. ఎంపీగారి దర్శనం ప్రజలకు ఏ మేరకు అందుతుందో చూడాలి.