English | Telugu

ఆస్ట్రేలియా కెప్టెన్ గా ధోనీ... ఈ దశాబ్దంలో ఒకే ఒక్కడు

టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీకి అరుదైన గౌరవం దక్కింది. క్రికెట్‌ ఆస్ట్రేలియా... ధోనీకి సముచిత స్థానాన్ని కట్టబెట్టింది. ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన వారికి ఇచ్చే గౌరవంలో భాగంగా ఈ దశాబ్దపు ఆస్ట్రేలియా వన్డే జట్టు కెప్టెన్‌గా ధోనీని ఎంపిక చేసింది. అలాగే, ఆ వన్డే టీమ్ లో ధోనీతోపాటు మరో ఇద్దరు భారత ఆటగాళ్లకు చోటు కల్పించింది. భారత్ కు తొలి టీ20 కప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీని అందించిన ధోనీని ఈ దశాబ్దపు కెప్టెన్‌‌గా క్రికెట్‌ ఆస్ట్రేలియా ఎంచుకుంది. ధోనీతో పాటు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు జట్టులో చోటు కల్పించింది. అంతేకాదు, ధోనీ సేవలను క్రికెట్ ఆస్ట్రేలియా కొనియాడింది. ధోని ఆడిన టైమ్ భారత్‌కు గోల్డెన్ పీరియడ్ అని, ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడని, ఓటమి కోరల్లో చిక్కుకున్న జట్టును విజయతీరాలకు చేర్చిన ఘనత అతడి సొంతమని ఆకాశానికి ఎత్తేసింది.

భారత క్రికెట్‌ చరిత్రలో మహేంద్రసింగ్‌ ధోనీది ప్రత్యేకస్థానం. బ్యాట్స్‌మన్‌గా, కీపర్‌గా, కెప్టెన్‌గా టీమిండియాను కొత్త పుంతలు తొక్కించిన మేటి ఆటగాడు. ఉత్కంఠ భరిత క్షణాల్లోనూ ప్రశాంతంగా ఆలోచిస్తూ విజయాలు అందుకున్న మిస్టర్‌ కూల్‌ కెప్టెన్. అలాంటి అరుదైన గుణగణాలు ఉన్నందుకే... మహేంద్రసింగ్‌ ధోనీ క్రికెట్ ఆస్ట్రేలియా వన్డే టీమ్ ఆఫ్ ద డికేడ్ కెప్టెన్‌గా ఎన్నికయ్యాడు.