English | Telugu

తుపాను వేళ.. జగన్ ఎక్కడ?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలు, శ్రేణులకు మంగళవారం (అక్టోబర్ 28) ఓ పిలుపు నిచ్చారు. మొంథా తుపాను సమయంలో బాధితులకు అండగా నిలవాలి, సహాయ కార్యక్రమాలలో పాల్గొనాలన్నది ఆ పిలుపు సారాంశం. సరే రాష్ట్రంలో విపత్తు సంభవించినప్పుడు ప్రజలకు అండగా ఉండాలన్న పిలుపునివ్వడం ముదావహం. కానీ ఇంతకీ ఆ పిలుపునిచ్చిన నాయకుడు ఎక్కడున్నారు? రాష్ట్రాన్ని పెను తుపాను అతలాకుతలం చేస్తుంటే.. దగ్గరుండి పార్టీ శ్రేణులకు సహాయ పునరావాస కార్యక్రమాలలో పాల్గొనేలా దిశా నిర్దేశం చేయాల్సిన ఆయన రాష్ట్రం వైపు కన్నెత్తి కూడా చూడకుండా.. బెంగళూరు ప్యాలెస్ లో విశ్రాంతిగా కూర్చుని పార్టీ నేతలూ, శ్రేణులను సహాయ పునరావాస కార్యక్రమాలలో పాల్గొనాలంటూ పిలుపునచ్చి చేతులు దులిపేసుకోవడమేంటని పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం నాడు బెంగళూరు వెళ్లారు. ఆయన ముందుగా నిర్ణయించిన మేరకు మంగళవారం (అక్టోబర్ 28)కి తాడేపల్లి రావాల్సి ఉంది. అయితే వాతావరణ ప్రతికూలత కారణంగా విమానాలు రద్దు కావడం వల్ల రాలేకపోతున్నారంటూ వైసీపీ ఓ ప్రకటన విడుదల చేసింది. కానీ.. శుక్రవారం నుంచే రాష్ట్రాన్ని పెను తుపాను ముప్పు ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. ఆదివారం (అక్టోబర్ 26)నాటికి అయితే తుపాను తీవ్రత అధికంగా ఉండబోతోందన్న క్లారిటీ కూడా వాతావరణ శాఖ ఇచ్చేసింది. తుపాను కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం ఉందనీ ప్రకటించింది. అంటే జగన్ కు తుపాను సహాయ కార్యక్రమాలలో పాల్గొనే విషయంలో సీరియస్ నెస్ ఉంటే.. ఆదివారమే బయలుదేరి తాడేపల్లికి చేరుకోవచ్చు. కానీ మంగళవారం వరకూ అంటే తుపాను తీరం దాటే రోజు వరకూ బెంగళూరులోనే ఉండిపోయారు. ఇప్పుడు తీరిగ్గా విమానాలు రద్దయ్యాయి కనుక రాలేకపోతున్నానంటూ ఓ ప్రకటన విడుదల చేయించారు.

అయితే జగన్ తీరు తొలి నుంచీ ఇదే విధంగా ఉందనీ, గతంలో కూడా ఆయన విపత్తు సమయంలో కాకుండా, ఆ తరువాత అంతా సర్దుమణిగాకా ఆర్భాటంగా పరామర్శ యాత్రలు చేసే వారనీ పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. ఆయన సీఎంగా ఉన్న సమయంలో విపత్తులు సంభవించిన సమయాలలో కూడా ఆయన తీరిగ్గా వీలు చూసుకుని ఓ సారి వెళ్లి పరామర్శించి రావడం తప్ప సహాయ పునరావాస కార్యక్ర మాలను పర్యవేక్షించి, అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేసిన సందర్భం లేదని అంటున్నారు.