English | Telugu

భయపెడుతున్న సెకండ్ వేవ్! అహ్మదాబాద్ లో నైట్ కర్ఫ్యూ

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. యూఎస్ తో పాటు యూరప్ దేశాల్లో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరిగిపోతోంది. మహమ్మారి కారణంగా మరణించేవారు పెరిగిపోతున్నారు. మన దేశంలోనూ కరోనా మళ్లీ భయపెడుతోంది. ఢిల్లీ, కేరళలో ఇప్పటికే సెకండ్ వేవ్ కారణంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గుజరాత్ లోనూ కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. దీంతో అప్రమత్తమైన గుజరాత్ సర్కార్.. అహ్మదాబాద్, గాంధీనగర్ పరిధిలో నైట్ కర్ఫ్యూను తిరిగి అమలు చేస్తోంది. శుక్రవారం నుంచి రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ కర్ఫ్యూ అమలులో ఉంటుందని, ప్రజలు బయటకు రారాదని అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఆదేశాలు జారీ చేసింది.

అహ్మదాబాద్ లో ఇప్పటివరకు 46,022 కరోనా కేసులు వచ్చాయి. పండగ సీజన్ తరువాత కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. నగరంలోని ఆసుపత్రుల్లో బెడ్లు కూడా వేగంగా నిండిపోతున్నాయి. కేసులు మరింతగా పెరగకుండా చూసేందుకే నైట్ కర్ఫ్యూ నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు. రోగులకు సరిపడినన్ని బెడ్లు ఉన్నాయని, పలు ఆసుపత్రుల్లో 40 శాతం బెడ్లు ఖాళీగానే ఉన్నాయని అదనపు చీఫ్ సెక్రెటరీ రాజీవ్ కుమార్ గుప్తా వెల్లడించారు. అహ్మదాబాద్ లో మైక్రో కంటెయిన్ మెంట్ ఏరియాల సంఖ్య 100కు పెరిగింది. వీటిల్లో రెసిడెన్షియల్ ప్రాంతాలతో పాటు అపార్టుమెంట్లు కూడా ఉన్నాయని, కేసుల బయట పడిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిని సారించి, వైరస్ వ్యాప్తి కాకుండా చూస్తున్నామని అధికారులు వెల్లడించారు.

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య ప్రమాదకరంగా పెరుగుతున్నప్పటికీ, మరో లాక్ డౌన్ లేదా నైట్ కర్ఫ్యూ విధించే ఆలోచనేదీ తమకు లేదని కేజ్రీవాల్ సర్కారు స్పష్టం చేసింది. అయితే బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరి చేసింది. మాస్క్ లేకుండా బయటికి వస్తే 2 వేల రూపాయల పైన్ విధిస్తామని ప్రకటించారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ప్రజలు మాస్క్ లు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ ను కట్టడి చేయవచ్చని ఢిల్లీ ఆర్థిక మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు.

భారత్‎లో కరోనా కేసులు 90 లక్షలు దాటాయి. గత 24 గంటల్లో కొత్తగా 45 వేల 882 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే కరోనా కారణంగా 584 మంది మృతి చెందారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా మొత్తం కేసుల సంఖ్య 90,04,366కి చేరింది. ఇప్పటివరకు 1,32,162 మంది మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 4,43,794 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి 84,28,410 మంది కోలుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.