English | Telugu

కలిసింది పట్టపగలే.. రాత్రి కాదు కదా.. బీజేపీ నేత సంచలన కామెంట్స్

ఏపీ మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను బీజేపీ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ కలవడంపై వైసీపీ నేతలు స్పందిస్తూ వారంతా కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. దీని పై స్పందించిన బీజేపీ సీనియర్ నేత విష్ణుకుమార్ రాజు రమేష్ కుమార్‌ను తమ పార్టీ నేతలు కలిసింది పట్ట పగలే కదా.. రాత్రి పూట కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు రమేష్ కుమార్‌ను ఈ ప్రభుత్వం ఎన్నికల ప్రధాన అధికారిగా గుర్తిస్తోందా లేదా అని అయన ప్రశ్నించారు.

నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి పదవిలో లేరని ఒక పక్క చెపుతున్న ప్రభుత్వం మరో పక్క ఆయనను ఇతరులు కలవడాన్ని ఎందుకు రాజకీయం చేస్తోంది అంటూ నిలదీశారు. అసలు వారు కలవడంలో కుట్ర ఏముందో చెప్పాలని ప్రభుత్వాన్ని అయన డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎవరినైనా కలవ వచ్చని ఆయన అన్నారు. కేసుల్లో ఉన్నవాళ్లు కూడా ఎవరెవర్నో కలుస్తుంటారని, అసలు ఇందులో తప్పేముందో చెప్పాలని విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. ఒక పక్క ఎంపీ రఘురామ కృష్ణం రాజు వ్యవహారం వెనుక బీజేపీ పెద్దల సపోర్ట్ ఉందని పుకార్లు వస్తుండగా.. మరో పక్క ఈ వివాదం బీజేపీ వర్సెస్ వైసిపిగా మారుతున్నట్లుగా కనిపిస్తోంది.