English | Telugu

గన్నవరం మళ్లీ గరం.. వల్లభనేని వంశీకి చేదు అనుభవం

గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి చేదు అనుభవం ఎదురైంది. ఇళ్ల పట్టాల పంపిణీకి వెళ్లిన ఎమ్మెల్యేను బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామస్తులు అడ్డుకున్నారు. వేదిక వద్దకు వెళ్లనీయకుండా ఓ వర్గం అడ్డుకుంది. తమ గ్రామంలోకి రావద్దంటూ, రోడ్డుపై బైఠాయించి.. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. తమ గ్రామంలో 1400 తెల్ల రేషన్‌ కార్డులు ఉంటే.. 400 మందికి మాత్రమే పట్టాలు ఇస్తున్నారని ఆరోపించారు. వేరే గ్రామాల వారికి తమ ఊరిలో పట్టాలు ఇస్తున్నారంటూ మండిపడ్డారు. గ్రామస్తులు అడ్డుకోవడంతో చేసేది ఏమీలేక వంశీ వెనుదిరిగి వెళ్లిపోయారు. అయితే, ఆ గ్రామంలో వైసీపీలో గ్రూపు విభేదాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. తమకు వ్యతిరేకంగా ఉన్నవర్గమే ఈ ఆందోళనను ప్రోత్సహించిందని వంశీ వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఇటీవలి కాలంలో గన్నవరం వైసీపీ నేతల వర్గీయులు తరచూ గొడవలు పడుతున్న సంగతి తెలిసిందే. ఏ ప్రభుత్వ కార్యక్రమం జరిగినా.. ఎమ్మెల్యే అనుకూల, వ్యతిరేక వర్గాలు అక్కడికి చేరుకుని ఉద్రిక్తతలకు కారణమవుతున్నారు.