English | Telugu
హర్ట్ అయిన పోలీసు అధికారి.. విజయవాడలో అర్ధనగ్న ప్రదర్శన
Updated : Oct 1, 2019
తన తప్పు లేకపోయినా మందలించారన్న మనస్తాపంతో ఓ పోలీసు అధికారి అర్ధనగ్న ప్రదర్శనకు దిగిన ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. ఈ ఘటన గత రాత్రి 11 గంటల సమయంలో దుర్గగుడి ఘాట్ రోడ్డు టోల్ గేటు వద్ద జరిగింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఓ మంత్రి అనుచరులు కొందరు ఉత్సవ కమిటీ కార్లలో వస్తుండగా సదరు పోలీసు అధికారి అడ్డుకున్నారు. దీంతో వారు మంత్రికి ఫోన్ చేయడంతో.. ఆయన పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ఉన్నతాధికారులు మంత్రి అనుచరులు వెళ్తున్న కార్లను ఆపిన పోలీసు అధికారికి ఫోన్ చేసి మందలించారు. తన తప్పు లేకున్నా మందలించడంతో ఆ పోలీస్ అధికారి మనస్తాపానికి గురయ్యారు. తాను ఎటువంటి తప్పూ చేయలేదని చెబుతున్నా వినిపించుకోకుండా, ఎక్కువ మాట్లాడితే సస్పెండ్ చేయిస్తామంటూ పై అధికారులు మండిపడ్డారని సదరు పోలీసు అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక, మనస్తాపంతో చొక్కా విప్పి నిరసన తెలిపారు. కాగా, ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందిస్తూ అది నిరసన కాదని, అతడు ఫిట్స్ వచ్చి పడిపోతే ఆసుపత్రికి తీసుకెళ్లామని చెప్పడం కొసమెరుపు.