English | Telugu
మంత్రుల పేషీలపై నిఘా... సెక్రటేరియట్ ను సాక్షి ఉద్యోగులతో నింపేస్తున్న జగన్.!
Updated : Oct 1, 2019
మొదట్నుంచీ మంత్రుల కార్యకలాపాలపై ఓ కన్నేసి ఉంచుతోన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి... ఇప్పుడు ఏకంగా వాళ్ల పేషీలపైనే నిఘా పెట్టారట. మంత్రుల ప్రతీ కదలికా తనకు తెలిసేలా పేషీలను తన మనుషులతో నింపేస్తున్నారట. కొందరు మంత్రులు, వాళ్ల పీఎస్ లు, పీఏలు అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి రావడంతో... తనకు నమ్మకస్తులైన వాళ్లను అమాత్యుల కార్యాలయాల్లో పీఆర్వోలుగా నియమించే ప్రక్రియ చేపట్టినట్లు తెలుస్తోంది. సీఎం జగన్మోహన్ రెడ్డి సూచన మేరకు ముఖ్యమంత్రి సలహాదారు జీవీడీ... పీఆర్వోల ఎంపిక ప్రక్రియ చేపట్టినట్లు చెబుతున్నారు. సాక్షి ఉద్యోగులనే మంత్రుల పేషీల్లో పీఆర్వోలుగా నియమించేందుకు రంగంసిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు కీలక విభాగాల్లో సాక్షి ఉద్యోగులను నియమించి సీనియర్ ఐఏఎస్ లను మించి లక్షల్లో జీతాలు కట్టబెడుతోన్న జగన్మోహన్ రెడ్డి... ఇఫ్పుడు సాక్షి విలేకరులను మంత్రుల పేషీల్లో పీఆర్వోలుగా నియమించాలని నిర్ణయించారట. వీళ్లంతా ఒకట్రెండు రోజుల్లోనే మంత్రుల పేషీల్లో విధుల్లోకి చేరనున్నట్లు తెలుస్తోంది. జగన్ మనుషులు... మంత్రుల పేషీల్లో అడుగుపెడితే, ఇకపై సెక్రటేరియట్ లో జరిగే ప్రతి కదలిక... ముఖ్యంగా మంత్రులను ఎవరెవరు కలుస్తున్నారు... ఏమేం చేస్తున్నారు... అనే సమాచారం ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరనుంది. అయితే, సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు మంత్రులకు ఇబ్బందికరంగా మారుతున్నాయట. తాము పేరు మాత్రమే మంత్రులమని, అన్నీ నిర్ణయాలు ముఖ్యమంత్రే తీసుకుంటున్నారని వాపోతున్నారట.
అయితే, చంద్రబాబు హయాంలోనూ మంత్రుల పేషీల్లో తన మనుషులను ఎమ్మెల్వోలుగా నియమించి, పేషీల్లో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. కానీ, అప్పుడు ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న బీజేపీ మంత్రులు మాత్రం బాబు నియమించిన పీఆర్వోలను, ఎమ్మెల్వోలను తిరస్కరించారు. తమకు నచ్చినవారినే నియమించుకున్నారు. అలాగే, సీనియర్ మంత్రులు కూడా తమ మనుషులనే పేషీల్లో అపాయింట్ చేసుకున్నారు. దాంతో, చంద్రబాబు కూడా పెద్దగా పట్టించుకోలేదు. మరి ఇప్పుడు జగన్ నియమిస్తున్న పీఆర్వోలు, ఎమ్మెల్వోలను మంత్రులు స్వీకరిస్తారో? లేక తిరస్కరిస్తారో? చూడాలి.