English | Telugu

ఇప్పుడు తెలిసిందా విజ‌య్‌..రాజ‌కీయాలంటే ఏంటో!

తమిళనాడులోని కరూర్‌లో.. సినీ నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్‌ ప్రచారసభ సందర్భంగా ఘోర విషాద ఘటన సంభవించింది. తొక్కిసలాట కారణంగా 40 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో విషాద ఘటనపై టీవీకే స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటనకు డీఎంకే ప్రభుత్వమే కారణమంటూ విమర్శించింది.

విజ‌య్ రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి ఎంతో కాలం కాలేదు. జ‌స్ట్ కొన్ని నెల‌లు మాత్ర‌మే అయ్యింది. గ‌తేడాది పార్టీ పెట్టిన విజ‌య్ వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో నేరుగా స్టాలిన్ పార్టీని ఢీ కొట్టేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఎవ‌రితో పొత్తుల్లేవ్ ఒంట‌రిగా వ‌స్తా అంటూ బీరాలు ప‌లికాడు. ఇప్పుడు త‌న రాజ‌కీయ ప్ర‌చారానికి 40 మంది ప్రాణాల‌ను బ‌లి తీస్కున్నాడు. అంతే కాదు మీడియా ఈ విషాద‌ఘ‌ట‌న‌పై ప్ర‌శ్నించ‌డానికి ట్రై చేస్తే ఎయిర్ పోర్టులో మొహం చాటేసుకుని వెళ్లిపోయాడు.

ఆపై త‌న గుండె బ‌ద్ధ‌లై పోయింద‌ని.. ఇప్పుడు నేను చెప్ప‌న‌ల‌వి కాని బాధ‌లో ఉన్నాన‌నీ ప్ర‌క‌ట‌న‌లు గుప్పిస్తున్నాడు. ఇంకా రాజక‌ీయ అరంగేట్రంలో బోణీ కొట్ట‌కుండానే.. ఆయ‌న ఖాతాలో ఇన్నేసి ప్రాణాలు. ఇపుడీ చితికిన బ‌తుకుల‌కు బాధ్యులెవ‌రు?

మృతుల్లో పిల్ల‌లు ఏడుగురు, మ‌హిళ‌లు 17 మంది వ‌ర‌కూ ఉండ‌గా.. 12 మంది ప‌రిస్తితి విష‌మంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశ‌ముంద‌ని అంటున్నారు క‌రూరు ప్ర‌భుత్వ ఆస్ప‌త్రి వైద్యులు.

అనుకున్న షెడ్యూల్ ప్ర‌కారం కాకుండా విజ‌య్ నాలుగు గంట‌లు ఆల‌స్యంగా రావ‌డ‌మే అస‌లు కార‌ణంగా చెబుతున్నారు. ఎండ‌లో భారీ ఎత్తున త‌మ అభిమాన న‌టుడి కోసం ఎదురు చూసి చూసిన జ‌నం.. ఆయ‌న వ‌చ్చేస‌రిక‌ల్లా డీలా ప‌డిపోయారు. ఒంట్లో శ‌క్తి లేక నీర‌సించి పోయారు.

అప్ప‌టికీ విజ‌య్ త‌న ప్ర‌సంగం ఆపి.. నీళ్ల బాటిళ్లు విసిరేశారు. కానీ అప్ప‌టికే ప‌రిస్థితి అదుపు త‌ప్పింది. ఈ లోగా క‌రెంటు పోవ‌డంతో ఎవ‌రు ఎక్క‌డ ఎలా చిక్కారో తెలీదు. అంతా అగ‌మ్య‌గోచ‌రం. దీంతో ప‌రిస్తితి అదుపు త‌ప్ప‌డం. వారిలో పిల్ల‌లు, మ‌హిళ‌లు చిక్కుకోవ‌డంతో ఇదీ ప‌రిస్థితి.

ఇలాంటిదేదో జ‌రుగుతుంద‌ని ముందే ఊహించిన స్టాలిన్ స‌ర్కార్ అప్ప‌టికీ ఆంక్ష‌లు విధించింది. అయినా స‌రే హైకోర్టుకెళ్లి వాటిని స‌వ‌రించుకుని మ‌రీ విజ‌య్ ఈ స‌భ ఏర్పాటు చేశారు. స‌మ‌యానికి రావ‌ల్సిన వాడు కాస్తా ఆల‌స్యం చేయ‌డంతో.. ఇంత విషాద‌ఘ‌ట‌న‌కు దారి తీసిన‌ట్టుగా తెలుస్తోంది.

రాజ‌కీయాలంటే డైలాగులు కొట్టినంత ఈజీ కాదు.. జ‌నం నాడి ప‌ట్ట‌డం అంత తేలిక కాదు. ఇప్పుడీ విషాదం ఆయ‌న పార్టీ ప‌ట్ల తీవ్ర వ్య‌తిరేక‌త‌ను మూట‌గ‌ట్టుకుంటుంది. సీఎం స్టాలిన్ అయితే క‌రూర్ కి ఆదివారం రావ‌ల్సింది శ‌నివార‌మే చేరుకున్నారు. ఇక ఆయ‌న త‌న‌యుడు, మంత్రి ఉద‌య‌నిధి స్టాలిన్
దుబాయ్ ప‌ర్య‌ట‌న ర‌ద్దు చేసుకుని మ‌రీ ఘ‌ట‌నా స్థ‌లి చేరుకున్నారు.

ఇప్పుడు విజ‌య్ ప‌రిస్థితి చూస్తే త‌న పార్టీకి ప్ర‌చారంగా మారాల్సిన స‌భ కాస్తా దుష్ప్ర‌చారానికి వేదికైంది. ఇప్ప‌టికే స్టాలిన్ స‌ర్కార్ మృతుల‌కు 10 ల‌క్ష‌లు, క్ష‌త‌గాత్రుల‌కు ల‌క్ష ప్ర‌క‌టించారు. సినిమాకు వంద కోట్ల మేర తీస్కునే విజ‌య్.. మ‌రి ఈ ప్రాణాల‌కు ఎంత ఖ‌రీదు క‌డ‌తారో తేలాల్సి ఉంది.ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.