English | Telugu
మండలిలో కాఫీ లొల్లి!
Updated : Sep 27, 2025
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో శనివారం (సెప్టెంబర్ 27) కాఫీపై వైసీపీ సభ్యులు రచ్చరచ్చ చేశారు. చర్చించడానికి ప్రజాసమస్యలేవీ లేవన్నట్లుగా శాసనమండలిలో కాఫీకీ, అసెంబ్లీలో కాఫీకీ తేడా ఉందంటూ రెచ్చిపోయి సభను స్తంభింపచేశారు. విషయమేమిటంటే శాసనసభలో అందించే కాఫీకి, శాసనమండలిలో అందించే కాఫీకి నాణ్యతలో తేడా ఉంటోందని మండలి చైర్మన్ మోషెన్ రాజు ఆరోపించారు. దీనిపై వైసీపీ సభ్యులు కాఫీతో పాటు భోజనాల విషయంలో కూడా వివక్ష చూపిస్తు న్నారంటూ ఆరోపణలు గుప్పించారు.
రెండు సభల్లోనూ ఒకే నాణ్యతతో ఆహార పదార్థాలు అందించాలని చైర్మన్ అన్నారు. అయితే వైసీపీ సభ్యులు మాత్రం విషయాన్ని అంతటితో వదిలేయకుండా.. కాఫీపై చర్చకు పట్టుబట్టి సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. ఈ పరిస్థితుల్లో మండలి చైర్మన్ సభను కొద్ది సేపు వాయిదా వేశారు. కాగా ఈ విషయంపై స్పందించిన సభా వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వివరణ ఇస్తూ మండలి, అసెంబ్లీలలో ఒకే నాణ్యతతో ఆహారం ఇస్తున్నారని చెప్పారు. ఎక్కడైనా పొరపాటు జరిగి ఉంటే పునరావృతం కాకుండా చూస్తామన్నారు.