English | Telugu

వీణా వాణీలకు వేర్వేరు హాల్‌టిక్కెట్లు

పదో తరగతి పరీక్షలకు సిద్ధపడుతున్న అవిభక్త కవలలు వీణావాణీలకు వేర్వేరు హాల్‌టిక్కెట్లు ఇచ్చిన‌ట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్‌, వెంగళ్‌రావునగర్‌ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న వీణా వాణీలకు అదే సెంటర్‌లో పదో తరగతి పరీక్షలు రాసేందుకు ఏర్పాట్లు చేశారు. వారు వేర్వేరుగా పరీక్ష రాసే సామర్ధ్యాలు ఉన్నాయని, వారు కావాలని అడిగితే స్కైబ్స్‌ ఏర్పాటేచేసేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు. వీణా వాణీలు పరీక్ష రాసేందుకు వీలుగా పరీక్షా కేంద్రంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

2016 వరకు నిలోఫర్‌ ఆస్పత్రిలో ఉన్న వీణా వాణీలను 2017లో స్టేట్‌హౌంకు తరలించారు. అక్కడ వారు ప్రత్యేక ఉపాధ్యా యుల పర్యవేక్షణలో చదువుతున్నారు. ఈ ఏడాది పదో తరగతికి రాగా...ఇటీవల వీరు ఎస్‌ఎస్‌సీ బోర్డుకు దరఖాస్తు చేసుకున్నారు. ఇద్దరికీ కలిపి ఒకే హాల్‌టికెట్‌ ఇవ్వాలా? వేర్వేరుగా ఇవ్వాలా? అనే అంశంపై బోర్డు అధికారులు మల్లగుల్లాలు పడ్డారు. పరీక్ష రాసే అర్హత, శక్తిసామర్థ్యాలు వారికి ఉన్నట్లు నిర్ధారించుకుని ఇద్దరికీ వేర్వేరుగా రెండు హాల్‌టికెట్లు జారీ చేయాలని నిర్ణయించారు.

మరో రెండు మూడు రోజుల్లో వీరికి హాల్‌ టికెట్లు అందజేసే అవకాశం ఉంది. వీరిలో ఒకరి ముఖం కింది వైపు చూస్తుంటే.. మరొకరిది పైకి చూస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో వారు కూర్చొని స్వయంగా పరీక్ష రాసే అవకాశం తక్కువ. వీణావాణీలు కోరితే ఇద్దరికీ స్క్రైబ్‌లను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు జిల్లా విద్యాశాఖప్రకటించింది.