English | Telugu
అమెరికా... కరోనా మృతులలో చైనాను మించి పోతుందా..?
Updated : Mar 27, 2020
తూర్పు ఐరోపా, యురేసియా ప్రాంతంలో అమెరికా సాయం పొందిన దేశాల నుంచి అమెరికాకు అవసరమైన వైద్య పరికరాలు, ఆరోగ్య రక్షణ ఉత్పత్తుల కోసం రంగంలోకి దిగాలని విదేశాంగ శాఖ అగ్రశ్రేణి దౌత్యవేత్తలకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు 'ఫారిన్ పాలసీ' పత్రిక తెలిపింది. మార్చి 22న ఐరోపా, యురేసియా దేశాలకు విదేశాంగ శాఖ సీనియర్ అధికారి డేవిడ్ హాలే పంపిన ఇమెయిల్ అంశాలు తమకు లభ్యమైనట్లు 'ఫారిన్ పాలసీ' పత్రిక పేర్కొన్నది.
వేలాది వెంటిలేటర్లు, ఇతర ఆధునిక పరికరాలు అవసరమని హాలే పేర్కొన్నారు. సంవత్సరాల తరబడి అనేక దేశాలకు సాయం అందించే చర్యలను సమన్వయం చేసే కార్యాలయం ద్వారానే ఇప్పుడు తమకే సాయం అవసరమని ఆయా దేశాలను అభ్యర్ధించింది అమోరికా. అయితే కరోనాతో వణికిపోతున్న తరుణంలో అవి ఏమాత్రం సాయం చేయగలవో తెలియదు.
ముందు జాగ్రత్తలు తీసుకోవటంలో నిర్లక్ష్యం చేసిన అమెరికా, దేశప్రజల ప్రాణాలకు పెను ముప్పు తెచ్చిందనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇప్పుడు హడావిడిగా దేశాధ్యక్షుడు ఆయుధ ఉత్పత్తులు చేసే పరిశ్రమలు వాటి బదులు అత్యవసరమైన వైద్య పరికరాల తయారీ చేపట్టేందుకు వీలుగా 'డిఫెన్స్ ప్రొడక్షన్' చట్టాన్ని వినియోగించేందుకు వీలు కల్పిస్తూ ట్రంప్ ఒక ఉత్తరువు మీద సంతకం చేశారు.
అమెరికా లోని పలు ఆసుపత్రులలో వైద్య సిబ్బంది, వాడిన మాస్కులనే మరోసారి వాడటమే కాకుండా, గత్యంతరం లేక నిర్మాణ రంగ కార్మికులు వినియోగించే మాస్కులను కూడా వినియోగించాల్సి వస్తోంది.
దేశంలో లక్ష వెంటిలేటర్లు ఉన్నాయని గత వారంలో ఉపాధ్యక్షుడు మైక్ పెనెస్ చెప్పగా, లక్షా 60 వేలు ఉన్నాయని 'న్యూయార్క్ టైమ్స్' పత్రిక వార్త పేర్కొన్నది. కరోనా వైరస్ బాధితులకు శ్వాస సంబంధమైన సమస్యలు తలెత్తుతాయి గనుక అమెరికాలో వేగంగా పెరుగుతున్న రోగులకు అవసరమైన వెంటిలేటర్లు లభ్యం కావేమో అనే ఆందోళన వ్యక్తం అవుతోంది.