English | Telugu

ఎంపీల సాయం నెవ్వర్ బిఫోర్..ఎవ్వర్ ఆఫ్టర్ 

అజీం ప్రేమ్ జీ అన్ని కోట్లు, అంబానీ ఇన్ని కోట్లు..వీరితో పాటు సినీ ప్రముఖులు, కాంట్రాక్టర్లు ఇతరత్రా ప్రముఖులు కూడా కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రధాని, రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి విరాళాలు ఇస్తున్నారని రోజూ చూస్తున్నాం. అంతవరకూ బాగానే ఉంది.. దేశంలో కరోనా మహమ్మారిని ఎదుర్కొనడానికి ఆ పార్లమెంటు సభ్యుడు ఇంత ఇచ్చాడు, ఈ పార్లమెంటు సభ్యుడు అంత ఇచ్చాడు అనే వార్తలూ చూస్తున్నాం. అత్త సొమ్ము అల్లుడి దానంలా చాలా మంది పార్లమెంటు సభ్యులు ఇస్తున్నది తమ ఎంపీ లాడ్స్ నిధుల నుంచి మాత్రమే అన్నది పచ్చి నిజం.

వీళ్ళలో ఎవరూ సొంత డబ్బులు రూపాయి కూడా సాయం చేయడం లేదు. కరోనా కట్టడి కోసం తమ ఎంపీ లాడ్స్ నిధుల నుంచి కొంత మొత్తం స్థానిక సంస్థలు ఉపయోగించుకోవాలని చెబుతూ ఆ ఎంపీలు సంబంధిత జిల్లా కలెక్టర్లకు, మునిసిపల్ కమిషనర్ లకు లేఖలు ఇస్తున్నారు. పైపెచ్చు తామేదో తమ సొంత డబ్బులు ఇస్తున్నట్లు ఫొటోలు తీయించుకుని పత్రికలలో వేయించుకుంటున్నారు. ఎంపీ లాడ్స్ నిధులు ప్రజల సొమ్మే. వారు సొంతగా ఇస్తున్నది కాదు. తెలుగు రాష్ట్రాలలోని ఎంపీలు సొంత డబ్బులు ఇచ్చిన వారు తక్కువే. ఇలా మంది సొమ్ము పందారం చేసిన వారే ఎక్కువగా కనిపిస్తున్నారు.
దేశంలో ప్రస్తుత పార్లమెంటులో దాదాపు 70 శాతం మంది కోటీశ్వరులున్నారు. వంద కోట్లకు పైబడి ఆస్తులు ఉన్న వారు లెక్కకు మించి ఉన్నారు. వెయ్యి కోట్ల ఆస్తులు దాటిన ఎంపీలూ ఉన్నారు. ఆర్ధిక నేరాలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి కూడా మన దేశంలో కొదవేం లేదు.

ఎంపీలు అందరూ తమ సొంత సొమ్ము ఇవ్వకపోవడం ఇక్కడ గమనార్హం. ఎంపీ లాడ్స్ ఇవ్వాళ కాకపోతే రేపు ప్రజలకు ఖర్చు చేయాల్సిందే. అది మీరు ఇప్పుడు ఇవ్వడం ఏమాత్రం గొప్ప కాదు. అయ్యా గౌరవ ఎంపిలూ.. సొంత డబ్బులు ఇవ్వండి. అప్పుడు మీ డబ్బాలు కొట్టుకోండి..మాకేం పర్వాలేదు.. మేము కూడా మెచ్చుకుంటాం అంటున్నారు ప్రజలు.