English | Telugu

మరో 'దిశా' ఘటన.. మహిళ పరిస్థితి విషమం

దిశ హత్యోదంతం మరువక ముందే యూపీలో మరో దారుణం కలకలం రేపుతోంది. ఉన్నవ్ లో ఓ మహిళ పై అయిదుగురు నిందితులు అత్యాచారం చేసి కిరోసిన్ పోసి నిప్పు పెట్టారు. తమ పై కేసు విత్ డ్రా చేసుకోలేదని ఆక్రోశంతోనే నిందితులు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఎనభై శాతం గాయాలపాలయిన బాధితురాలిని హుటాహుటిన లక్నో ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా వైద్యులు తెలిపారు. తన పై అయిదుగురు అత్యాచారం చేశారంటూ కొన్ని నెలల కిందట బాధితురాలు కేసు పెట్టింది. అప్పట్నుంచీ కేసు విత్ డ్రా చేసుకోవాలి అంటూ ఆమె పై నిందితులు ఒత్తిడి తీసుకొచ్చారు. కానీ ఆమె దానికి అంగీకరించకపోవడంతో ఆమెను ఎలాగైనా హతమార్చాలన్న కసితో రగిలిపోయిన నిందుతులు అదనుకోసం వేచి చూశారు. రాయిబరేలి వెళ్లేందుకు ఆమె ఊరికి బయటికి రాగా అడ్డగించి రోడ్డు పైనే కిరోసిన్ పోసి తగలబెట్టేశారు. దారుణానికి ఒడిగట్టిన ఐదుగురు నిందితుల్లో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారైన మరో ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు. వారం కిందట దిశా హత్యోదంతం ఒక్క సారిగా షాక్ కు గురి చేసిన నేపథ్యంలో యూపీ ఘటన మరోసారి తీవ్రంగా కలచి వేస్తోంది.