English | Telugu

మళ్ళీ ఆసుపత్రిలో చేరిన హోం మంత్రి అమిత్ షా

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆయనకు గురుగాం లోని వేదాంత హాస్పిటల్ లో రెండు వారాలుగా చికిత్స అందించిన తరువాత ఆయనకు టెస్ట్ చేయగా నెగెటివ్‌ రావడంతో డిస్చార్జు చేసారు. కరోనా నుండి కోలుకున్నందుకు ఈశ్వరుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అమిత్ షా ప్రకటన కూడా చేశారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగుపడేవరకు ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు.

అయితే తాజాగా ఆయన శ్వాసకోశ సమస్యతో బాధపడుతుండడంతో మెరుగైన వైద్యం కోసం ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్‌ కు తరలించారు. ఇప్పటి నుండి ఎయిమ్స్‌లోనే ఆయన చికిత్స తీసుకోనున్నారు. ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్ రణదీప్ గులేరియా నేతృత్వంలో ఆయనకు చికిత్స అందుతోంది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై పలువురు ప్రముఖులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు ఎయిమ్స్ వైద్యులు ప్రకటించారు.